యువతా.. నోటీసుతో జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

యువతా.. నోటీసుతో జాగ్రత్త

Oct 1 2026 4:46 AM | Updated on Oct 1 2026 4:46 AM

● వయసు వారీగా పత్రాలివ్వాల్సిందే ● రెండు చోట్ల ఓటుంటే వేటే!

కరీంనగర్‌ అర్బన్‌: సర్‌ ప్రక్రియ పక్కాగా చేపడుతున్నారు. బోగస్‌ ఓటర్లకు తావు లేకుండా పరిశీలన చేపడుతున్నారు. ఎన్నికలాధికారులు ఇస్తున్న నోటీసులకు జవాబిచ్చే ముందు.. 22 ఏళ్లలోపు వయసున్న ఓటర్లు జాగ్రత్త వహించాల్సి ఉండగా స్వీయ గుర్తింపుకార్డుతో పాటు తల్లిదండ్రుల గుర్తింపుకార్డులనూ ఎన్నికల అధికారికి అందజేయాలి. అప్పుడే ఓటును తుది జాబితాకు పంపిస్తారు. లేదంటే రద్దు చేస్తారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా నోటీసులందుకుంటున్న ఓటర్లు.. ఏఏ పత్రాలను అందజేయాలో తెలియక చాలామంది ఆధార్‌ కారు్‌ోడ్త వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల అధికారులు వయసుల వారీగా ఎవరెవరు, ఎన్ని గుర్తింపుకార్డులు అందజేయాలో వివరించి ఓటర్లను వెనక్కి పంపుతున్నారు.

తుది దశలో పంపిణీ

ఆగస్టు 17, 2026న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ముసాయిదా జాబితా ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం ఆ రోజు నుంచే నోటీసుల పంపిణీ మొదలవాల్సి ఉండగా వారం తర్వాత ప్రారంభమైంది. జిల్లాలో 1300కు పైగా పోలింగ్‌ కేంద్రాలుండగా, బూత్‌లవారీగా బీఎల్‌వోలు నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసుల ప్రక్రియ చివరి దశకు చేరుకోగా ఓటర్లు వివరాలను అందజేస్తున్నారు. నోటీసులకు బదులిచ్చే క్రమంలో కొందరు ఆధార్‌ కార్డు ఇస్తున్నారని, మరో ఆమోదిత గుర్తింపు కార్డును జత చేయాలని అధికారులు కోరుతున్నారు. కొత్త ఓటు నమోదు కోసం ఫారం–6, ఓటరు వివరాల సవరణ కోసం ఫారం–8ను సమర్పించే వారు వాటితో పాటు డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉందని గుర్తుచేస్తున్నారు.

నోటీసులు ఎవరికి?

ఎన్యూమరేషన్‌ ఫారంలో 2002 జాబితా లోని తల్లిదండ్రులు లేదా వ్యక్తిగత వివరాలు నమోదు చేయకపోవడం, పేరు, పుట్టినతేదీ, లింగం, చిరునామాలో తప్పులుండటం వంటి కేటగిరీలోని వారికి నోటీసులు జారీ అందజేశారు.

రెండుచోట్ల ఓటుంటే.. వేటే!

ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉండటం, నివాసం మారినా పాత ఓటు తొలగించకపోవడం తదితర సమస్యలు ఎన్నికల నిర్వహణకు సవాలుగా మారాయి. దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎన్నికల సంఘం ఏఐ ఆధారిత టూల్స్‌ వినియోగిస్తోంది. ఉపాధి, ఉన్నత చదువుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లినా.. వివాహం తర్వాత నివాసం మారినా చాలా మంది పాతచోట ఓటు తొలగించకుండానే కొత్తది నమోదు చేసుకుంటున్నారు. ఓ వ్యక్తి కొత్తగా ఓటు హక్కు కోసం ఫారం–6 సమర్పించగానే ఆ వివరాలు దేశంలో వేరేచోట నమోదై ఉన్నాయా? లేదా? అనేది తక్షణమే తనిఖీ చేస్తుంది. సిస్టం అందించిన జాబితా ఆధారంగా బీఎల్వోలు నేరుగా ఓటరు ఇంటికి వెళ్లి వివరాలు ధ్రువీకరిస్తారు. డబుల్‌ ఎంట్రీలు ఉన్నట్లు తేలితే ఓటరు అనుమతితో లేదా నిబంధనల ప్రకారం ఫారం–7 ద్వారా పాత ఓట్లు తొలగించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement