చెత్తగుట్ట తరిగేనా? | - | Sakshi
Sakshi News home page

చెత్తగుట్ట తరిగేనా?

Sep 28 2026 1:35 AM | Updated on Sep 28 2026 1:35 AM

డంప్‌యార్డ్‌లో బయోమైనింగ్‌ రూ.16 కోట్లతో కొత్తగా టెండర్‌ రూ.106 కోట్లతో ప్రాసెసింగ్‌ యూనిట్‌ యూసీఎఫ్‌, ఎస్‌బీఎం నిధులతో ప్రతిపాదన ఆచరణకు నోచుకుంటే డంప్‌ యార్డ్‌కు శాశ్వత పరిష్కారం

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరానికి రాచపుండులా మారిన డంప్‌యార్డ్‌ ప్రక్షాళనకు అడుగులు పడుతున్నాయి. చెత్తగుట్టను కరిగించే క్రమంలో బయోమైనింగ్‌ చేసేందుకు రూ.16 కోట్లతో తాజాగా బల్దియా టెండర్‌ ప్రక్రియ చేపట్టింది. శాశ్వత పరిష్కారం కోసం ప్రాసెసింగ్‌ యూనిట్‌ నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రతిపాదనలు, బయోమైనింగ్‌, ప్రాసెసింగ్‌ పకడ్బందీగా ఆచరణకు నోచుకుంటే నగరానికి డంప్‌యార్డ్‌ సమస్య శాశ్వతంగా దూరం కానుంది.

రూ.16 కోట్లతో బయోమైనింగ్‌

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ నిధులు రూ.16 కోట్లతో డంప్‌యార్డ్‌లో చెత్తను బయోమైనింగ్‌ చేసేందుకు నగరపాలకసంస్థ టెండర్‌ ప్రక్రియ మొదలు పెట్టింది. 2.60లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను బయోమైనింగ్‌ ద్వారా కరిగించనున్నారు. మరో పది రోజుల్లో టెండర్‌ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. టెండర్‌ దక్కించుకునే కాంట్రాక్ట్‌ ఏజెన్సీ పూర్తిస్థాయిలో బయోమైనింగ్‌ చేస్తేనే తప్ప అనుకున్న లక్ష్యం నెరవేరదు.

రూ.106 కోట్లతో ప్రాసెసింగ్‌ యూనిట్‌

డంప్‌యార్డ్‌లో చెత్తను బయోమైనింగ్‌ చేయడంతో పాటు ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నెలకొల్పేందుకు బల్దియా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. యూసీఎఫ్‌, స్వచ్ఛభారత్‌ మిషన్‌ నిధులతో చేపట్టనున్న ఈ ప్రాసెసింగ్‌ యూనిట్‌ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే మానేరు ఒడ్డున ఉన్న డంప్‌యార్డ్‌ మాయమవుతుంది. రూ.106 కోట్ల నిధులతో ప్రాసెసింగ్‌ యూనిట్‌తో పాటు, ఎలక్ట్రిక్‌ స్వచ్ఛ ఆటోలు, భారీ ట్రక్కులు కొనుగోలు చేయనున్నారు. ప్రాసెసింగ్‌ యూనిట్‌ నెలకొల్పిన తరువాత, స్వచ్ఛ ఆటోల ద్వారా కాకుండా భారీట్రక్కుల ద్వారా చెత్తను తరలించనున్నారు.

బయోమైనింగ్‌లో జాప్యం

2021లో స్మార్ట్‌సిటీ నిధులు రూ.16.50 కోట్లతో బయోమైనింగ్‌కు టెండర్‌ నిర్వహించారు. కాంట్రాక్ట్‌ దక్కించుకొన్న ఏజెన్సీ అప్పుడున్న పరిణామం మేరకు డంప్‌యార్డ్‌లోని రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను బయోమైనింగ్‌ చేయాల్సి ఉంది. విపరీతమైన జాప్యంతో ఏజెన్సీకి గడువు పలుమార్లు పొడిగించినా, వందశాతం లక్ష్యం చేరుకోలేదు. నాలుగైదేళ్ల గడువు పొడిగిస్తే లక్షా 50 వేల మెట్రిక్‌టన్నుల చెత్తను బయోమైనింగ్‌ చేయగలిగారు. ఇంకా 50వేల మెట్రిక్‌ టన్నుల చెత్త మిగిలిపోయింది. ఈ లోగా ప్రతి రోజు టన్నుల కొద్ది చెత్త వచ్చి డంప్‌యార్డ్‌లో చేరడంతో మొత్తం చెత్త 3.50లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరింది. దీనితో చెత్త తరగడం అనేది పోయి గుట్టలుగా పేరుకుపోయింది. మొదటి ఏజెన్సీ చేతులెత్తేయడంతో స్వచ్ఛభారత్‌ మిషన్‌ ద్వారా రూ.2 కోట్లతో గతేడాది 30 వేల మెట్రిక్‌టన్నుల చెత్తను బయోమైనింగ్‌ చేసేందుకు టెండర్‌ పిలిచారు. సదరు ఏజెన్సీ ఇప్పటివరకు 29 వేల మెట్రిక్‌టన్నుల చెత్తను బయోమైనింగ్‌ చేసింది. స్వచ్ఛభారత్‌ మిషన్‌లో నిధులు ప్రత్యేకంగా కేటాయించబడి ఉండడంతో తాజాగా రూ.16 కోట్ల నిధులతో 2.60 లక్షల మెట్రిక్‌టన్నుల చెత్తను బయోమైనింగ్‌ చేసేందుకు టెండర్‌ ప్రక్రియ చేపట్టారు.

ప్రతిపాదనలు ఆచరణకు నోచుకొంటేనే...

బయోమైనింగ్‌ ద్వారా చెత్త లేకుండా చేసేందుకు నగరపాలకసంస్థ రూపొందించిన ప్రతిపాదనలు వందశాతం ఆచరణకు నోచుకుంటేనే డంప్‌యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. రూ.16 కోట్లతో చేపట్టనున్న బయోమైనింగ్‌ను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేస్తేనే, చెత్త గుట్ట తగ్గుతుంది. ఆ తరువాత మిగిలిన చెత్తను బయోమైనింగ్‌ చేయాల్సి ఉంటుంది. భారీస్థాయిలో నెలకొల్ప నున్న ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు, ప్రారంభానికి ఎలాంటి అడ్డంకులు లేకపోతే, డంప్‌యార్డ్‌ సమస్యకు శాశ్వత ముగింపు లభించినట్లే. లేనట్లయితే డంప్‌యార్డ్‌ సమస్య మళ్లీ మొదటికొచ్చినట్లే.

నగర శివారులోని డంపింగ్‌ యార్డు

సంవత్సరం 2025–26

టెండర్‌ రూ.2 కోట్లు (స్వచ్ఛభారత్‌మిషన్‌)

బయోమైనింగ్‌ చేయాల్సిన చెత్త

30 వేల మెట్రిక్‌ టన్నులు

బయోమైనింగ్‌ చేసిన చెత్త

29 వేల మెట్రిక్‌ టన్నులు

చేయాల్సిన చెత్త– టన్ను

సంవత్సరం 2026,

సెప్టెంబర్‌/అక్టోబర్‌

టెండర్‌ రూ.16 కోట్లు(స్వచ్ఛ భారత్‌ మిషన్‌)

బయోమైనింగ్‌ చేయాల్సిన చెత్త

2.60 లక్షల మెట్రిక్‌టన్నులు

(ప్రస్తుతం టెండర్‌ ప్రక్రియ దశలో ఉంది)

నగరపాలకసంస్థ డివిజన్లు66

నగర జనాభా దాదాపు 4 లక్షలు

డంప్‌యార్డ్‌లో నిల్వఉన్న చెత్త

3.50 లక్షల మెట్రిక్‌ టన్నులు

ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్న చెత్త

140 నుంచి 150 మెట్రిక్‌ టన్నులు

బయోమైనింగ్‌ చరిత్ర

సంవత్సరం 2021

టెండర్‌రూ.16.50 కోట్లు (స్మార్ట్‌సిటీ)

బయోమైనింగ్‌ చేయాల్సిన చెత్త

2 లక్షల మెట్రిక్‌ టన్నులు

బయోమైనింగ్‌ చేసిన చెత్త

దాదాపు 1.50 లక్షల మెట్రిక్‌ టన్నులు

వదిలేసిన చెత్త

50 వేల మెట్రిక్‌ టన్నులు

ప్రాసెసింగ్‌ యూనిట్‌

(ప్రతిపాదన)

అంచనా వ్యయం రూ.106 కోట్లు

నిధులు ఎస్‌బీఎం రూ.16 కోట్లు,

యూసీఎఫ్‌ రూ.90 కోట్లు

కొనుగోలు: ఎలక్ట్రిక్‌ స్వచ్ఛ ఆటోలు,

భారీ ట్రక్కులు

ప్రాసెసింగ్‌: తడి, పొడి చెత్త వేరు చేయడం, తడిచెత్తతో కంపోస్ట్‌ తయారు చేయడం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement