● రన్‌ను ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి వేణు గోపాల్ ● 5,500 మందికి పైగా హాజరు
కరీంనగర్‌స్పోర్ట్స్: రన్ ఫర్ హెల్త్ సే నో టు డ్రగ్స్ సందేశంతో కరీంనగర్ ఆదివారం పరుగుల సంద్రంగా మారింది. కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ ఎడిషన్ కరీంనగర్ మారథాన్–2026 ఆదివారం ఉత్సాహంగా సాగింది. మారథాన్‌ను అంబేద్కర్‌స్టేడియంలో హైకోర్టు జడ్జి వేణుగోపాల్, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష జెండా ఊపి ప్రారంభించారు. కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పసుల మహేశ్, సిద్ధార్థ పాఠశాలల చైర్మన్ దాసరి శ్రీపాల్‌రెడ్డి, సతీశ్‌రావు, ప్రతాప్, ఉపేందర్ పాల్గొన్నారు.
ఉత్సాహంగా సాగిన రన్
ఆదివారం వేకువజామున 5 గంటలకే అంబేద్కర్ స్టేడియం సందడిగా మారింది. సంగీతం, కేరింతలు, ఉత్సాహ నినాదాలతో పండుగ వాతావరణం నెలకొంది. ముందస్తుగా నమోదు చేసుకున్న సుమారు 5,500 మందికి పైగా రన్నర్లు మారథాన్‌లో పాల్గొన్నారు. 3,5,10, 21కిలో మీటర్ల రన్ భగత్‌నగర్, కలెక్టరేట్, ప్రతిమ మల్టీఫ్లెక్స్, తెలంగాణచౌక్, మంకమ్మతోట, రాంనగర్, పద్మనగర్ చౌరస్తా, డ్యాం మీదుగా తిరిగి అంబేద్కర్ స్టేడియం వరకు ఉత్సాహంగా సాగింది. అనంతరం మారథాన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరితో నో టు డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయించారు.


