సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ ౖపైపెకి.. | - | Sakshi
Sakshi News home page

సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ ౖపైపెకి..

Sep 26 2026 12:38 AM | Updated on Sep 26 2026 12:38 AM

జగిత్యాలఅగ్రికల్చర్‌: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం జిల్లా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే యుద్ధం ప్రారంభం నుంచి రెండింతలు పెరిగిన రసాయన ఎరువుల ధరలు.. యాసంగి సీజన్‌ నాటికి మరింతగా ఎగబాకే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా పంటల కీలక దశలో వాడే సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు విదేశాల నుంచి దిగుమతి కావడం, ఆ మేరకు ధరలు పెరుగుతుండడంతో.. కంపెనీలు రేట్ల పెంపునకు ప్రయత్నాలు చేస్తుండడం రైతులకు కంటగింపుగా మారాయి. వానాకాలంతోపాటు యాసంగిలోనూ వరి గింజ గట్టిదనానికి వరిలో చివరి డోసుగా సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ను రైతులు వాడుతుంటారు.

3,500 మె.ట. ఎస్‌ఎస్‌పీ

జిల్లాలో కనీసం ఒక్క సీజన్‌కు 3,500 మె.ట సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ వినియోగిస్తారు. సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ తయారీకి ప్రధానంగా సల్ఫర్‌ను వాడతారు. రసాయన ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పోటాష్‌ తర్వాత సల్ఫర్‌ అతి ముఖ్య పోషకం. సల్ఫర్‌ ధరలు అంతర్జాతీయంగా మండిపోతున్నాయి. దాదాపు 84 శాతం సల్ఫర్‌ ఓమెన్‌, యూఏఈ, ఖతార్‌, సౌదీ అరెబియా, కువైట్‌ వంటి పశ్చిమాసియా దేశాల నుంచి దిగుమతి అవుతుండడం, ఆ దేశాల్లో యుద్ధ వాతావరణంతో అంతర్జాతీయ సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతిని రేట్లు పెరుగుతున్నాయి. సీజన్‌ ప్రారంభంతో పోల్చితే సల్ఫర్‌ ధరలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతానికి రైతులే సీజన్‌ ప్రారంభంలో 50 కిలోల బస్తాను రూ.560కు కొనుగోలు చేయగా.. ప్రస్తుతం రూ.780 పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులు పంటలకు ఉపయోగించే అమ్మోనియం సల్ఫేట్‌లో 24 శాతం, సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌లో 14 శాతం, పోటాషియం సల్ఫేట్‌లో 18 శాతం, 20–20–15 కాంప్లెక్స్‌ ఎరువులో 15 శాతం సల్ఫర్‌ ఉంటుంది. ఇవే కాకుండా జింక్‌ సల్ఫేట్‌, మెగ్నిషియం సల్ఫేట్‌, జిప్సంలో కూడా దాదాపు 15 శాతం వరకు సల్ఫర్‌ ఉంటుంది.

మరింత డిమాండ్‌

జిల్లాలో యాసంగి సీజన్‌లో ఎల్‌నినో నేపథ్యంలో వరిని పూర్తిగా తగ్గించి ఆరుతడి పంటలు వేయాలని ప్రభుత్వం రైతులపై ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో దాదాపు 3లక్షల ఎకరాల వరకు వేరుశనగ, నువ్వులు, కంది వంటి పంటలు సాగు చేసే అవకాశముంది. ఈ పంటల్లో మొక్కల పెరుగుదలకు, మొక్కల్లో పత్రహరితం ఏర్పడి కిరణ జన్య సంయోగ క్రియ జరిగేందుకు, నూనె, పప్పు గింజల పంటల్లో గింజ బలపడి నూనె, పప్పుల శాతం పెరిగేందుకు సల్ఫర్‌ ఉన్న ఎస్‌ఎస్‌పీని ఎక్కువగా ఉపయోగిస్తారు. సల్ఫర్‌ కొరత, ధరల పెరుగుదల వల్ల ఎరువుల తయారీ కంపెనీలపై భారీగా వ్యయం పడుతుండడంతో.. ఆ ఖర్చును రైతులపై మోపే అవకాశం మెండుగా ఉంది. ప్రభుత్వం ఎరువుల ధరలను నియంత్రిస్తున్నా.. ఎరువుల తయారీకి ఉపయోగించే పోషకాల రేట్లు పెరిగినప్పుడు పెంచే పరిస్థితి తప్పకపోవచ్చు.

పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల ప్రభావం

ఇప్పటికే రెండింతలు పెరిగిన రసాయన ఎరువుల ధరలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement