రామగుండం: సింగరేణి గనుల నుంచి రామగుండం ద్వారా బొగ్గు తరలించేందుకు కుందనపల్లి అనుబంధ బద్రిపల్లి, 25వ డివిజన్‌లోని మల్యాలపల్లి నుంచి గూడ్సు కోసం రైల్వేలైన్ ఉంది.
ప్రాణాలు వదిలిన అమ్మమ్మ..
గణపతి నిమజ్జనం సందర్భంగా ఇద్దరు మనువరాళ్లతో కలిసి అమ్మ మ్మ నాంసాని లక్ష్మి బద్రిపల్లిలోని మండపానికి రైల్వేలైన్ దాటి వెళ్లింది. దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ఆగిఉన్న గూడ్సు కింద నుంచి మనుమరాళ్లను ట్రాక్ దాటించింది. ఆ తర్వాత లక్ష్మి దాటుతుండగా గూడ్సు కదిలి చీరెకొంగు వ్యాగన్ కింద ఇనుప చువ్వకు తట్టుకుంది. లోపలికి లాగడంతో ఆమె పట్టాలపై పడిపోయింది. గూడ్సు ఆమైపె వెళ్లడమే కాకుండా రామగుండం రైల్వేయార్డు వరకూ సుమారు రెండు కి.మీ. వరకు ఈడ్చుకెళ్లింది. మాంసం ముద్దలు అక్కడక్కడా పడడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. ఇరవై ఏళ్ల క్రితం ఆమె భర్త అంజయ్య సైతం గూడ్సు కిందినుంచి వెళ్తుండగా కాలు తెగిపోయింది. ఇప్పుడు దుర్భర జీవితం గడుపుతున్నాడు.
ఏటా గూడ్సుకు బలి
గత పదేళ్లలో బద్రిపల్లి, మల్యాలపల్లిలకు చెందిన పదుల సంఖ్యలో ప్రజలు గూడ్సు ప్రమాద బాధిత కుటుంబాలున్నాయి. కుందనపల్లి సర్పంచ్ అర్కుటి కొమురయ్యయాదవ్ స్వగ్రామం బద్రిపల్లి. ఆయన తల్లి పదేళ్ల క్రితం గూడ్సు కింద నుంచి వస్తూ రైలు కదలడంతో వెంటనే పట్టాల మధ్య పడుకున్నాడు. ఈక్రమంలో తీవ్రగాయాలై ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ, మానసికంగా మార్పు వచ్చి అనారోగ్యం బారిన పడినట్లు కుమారుడు కొమురయ్య తెలిపాడు. అదేవిధంగా దాసరి సురేందర్ మృతి, చింతల రాజయ్య కాలు తెగిపోవడం, మర్రి రాజలింగు తీవ్రగాయాలై మృతి చెందడం, చింతల శైలజ తృటిలో ప్రాణపాయం నుంచి బయటపడడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. మల్యాలపల్లికి చెందిన ఈర్ల నారాయణ వాహనాన్ని పూజకు తీసుకెళ్తుండగా గూడ్సు ఢీకొని రెండు కాళ్లు తెగిపోయాయి. మరో ఘటనలో అంతటి పోశెట్టి తీవ్రగాయాల పాలయ్యాడు.
ప్రత్యామ్నాయం.. దూరభారం
బద్రిపల్లి – మల్యాలపల్లి మధ్య రైల్వేట్రాక్‌కు సమాంతరంగా సీసీ రోడ్డు నిర్మించారు. బద్రిపల్లి ట్రాక్‌పై గూడ్సు నిలిచి ఉంటే మల్యాలపల్లి వరకు వెళ్లి పట్టాలు దాటి మళ్లీ వెనక్కిరావాలి. ఇందు కోసం ఇరువైపులా కనీసం మూడు కి.మీ. అదనంగా ప్రయాణించాలి. అందూరం దూరం వెళ్లలేక రైలు అక్కడినుంచి వెళ్లేవరకూ గ్రామస్తులు నిరీక్షిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో గేట్లు ఏర్పాటు చేయకుండా ఓ వ్యక్తిని కాపాలాగా ఉంచి రైళ్ల రాకపోకలపై ఫోన్ ద్వారా గ్రామస్తులు సమాచారం సేకరించి పట్టాలకు అడ్డుగా చైన్ కడుతున్నారు.
15రోజుల్లోనే తోటికోడళ్లు మృతి
15రోజుల క్రితం ఇందిరమ్మకాలనీ నుంచి బద్రిపల్లికి వస్తూ రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని నాంసాని భూమమ్మ దుర్మరణం చెందింది. ఆమె తోటికోడలు నాంసాని లక్ష్మి గూడ్సు రైలు ప్రమాదంలో చనిపోవడం, 15రోజుల్లోనే తోటికోడళ్లు మృతి చెందడం కలకలం రేపింది.
విస్తరిస్తున్న ట్రాక్‌లతో మరింత ప్రమాదం
ఇప్పటికే అందుబాటులో మూడు రైల్వేలైన్లు
మరోరైల్వేలైన్ నిర్మాణానికి అధికారుల సన్నాహాలు


