హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ మండలం జూపాక గ్రామంలోని మైసమ్మ చెరువులో మొసలి ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. శుక్రవారం పశువులను మేపేందుకు చెరువు సమీపానికి వెళ్లిన కాపరులకు.. నీటిలోని తా మర తుప్పల మధ్య భారీ మొసలి కనిపించింది. భయాందోళనకు గురైన వారు గ్రామంలోకి వెళ్లి విషయం చెప్పారు. రెండు రోజులుగా చెరువులో మొసలి ఉందన్న ప్రచారం జరుగుతోంది. కొందరు చెరువు పరిసరాల్లో గాలించినప్పటికీ ఆచూకీ దొరకలేదు. తాజాగా పశువుల కాపరులు కళ్లారా చూడడంతో ప్రచారం కాస్త నిజమని తేలింది. అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి, మొసలిని బంధించి, జనావాసాలకు దూరంగా విడిచిపెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఫార్మసిస్టుల పాత్ర కీలకం
కరీంనగర్: వైద్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజగోపాల్‌రావు అన్నారు. ఫార్మసిస్టుల దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్‌వో తన ఆఫీస్‌లో ఫార్మసీ అధికారులు, సిబ్బందితో కలిసి కేక్‌కట్ చేశారు.
కరీంనగర్ అర్బన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ ఛైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. స్థానిక టీఎన్జీవో భవన్‌లో మాట్లాడుతూ డీఏ బకాయిలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చిందని, దసరాకు రెండు డీఏల విడుదల, సంక్రాంతి నాటికి మరో డీఏ ను విడుదల చేయడానికి హామీ ఇచ్చిందని వివరించారు. ఈ నెల 30న ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవిష్కరణ కార్యక్రమానికి రానున్నందున ఉద్యోగుల పక్షాన స్వాగతం పలకాలని కోరారు. ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళిచరణ్, టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి సంగేం లక్ష్మణ్ రావు, కో శాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, గెజిటెడ్ అధి కారుల సంఘం జిల్లా కార్యదర్శి డాక్టర్ అరవింద్ రెడ్డి, పెన్షనర్ల సంఘం నాయకులు పెండ్యాల కేశవరెడ్డి, ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించండి
కరీంనగర్ అర్బన్: ఐదు పని దినాల బ్యాంకింగ్ విధానం అమలు చేయాలనే డిమాండ్‌తో బ్యాంకర్లు సమ్మెకు దిగుతున్నారు. ఈ నెల 28నుంచి 30వరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలో అన్ని బ్యాంకులకు మూతపడనున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కస్టమర్లు ప్రత్యామ్నాయాలను అనుసరించాలని సూచిస్తున్నారు. మూడు రోజులు బ్యాంకు సేవలకు అంతరాయం కలగనున్న నేపథ్యంలో ఎటీఎం, కస్టమర్ సర్వీస్ పాయింట్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి డిజిటల్ సేవలను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.
అటవీ భూముల రక్షణకు చర్యలు
కరీంనగర్ అర్బన్: జిల్లాలోని అటవీ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సంబంధిత ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అటవీశాఖ, వన్యప్రాణుల ప్రొటెక్షన్ కమిటీ సమావేశాన్ని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, అటవీ శాఖ అధికారులతో కలిసి నిర్వహించారు. జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో అటవీ భూములున్నాయని, సరిహద్దులు ఏర్పాటు చేయాలన్నారు. డీఎఫ్‌ఓ సత్యనారా యణ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించి.. రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. జిల్లాకేంద్రంలోని బైపాస్ వద్ద ఎన్టీఆర్ బొమ్మ సమీపంలో అటవీశాఖ చెక్‌పోస్ట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సైదాపూర్ మండలం రాయికల్ వాటర్ ఫాల్స్‌కు జన సందడి పెరుగుతున్నందున బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. ఎఫ్‌ఆర్‌వోలు షోకత్ హుస్సేన్, లత పాల్గొన్నారు.


