బీజేపీ కార్పొరేటర్‌ బండారి వేణుకు సమన్లు | - | Sakshi
Sakshi News home page

బీజేపీ కార్పొరేటర్‌ బండారి వేణుకు సమన్లు

Sep 26 2026 12:08 AM | Updated on Sep 26 2026 12:08 AM

జారీచేసిన చార్మినార్‌ సిటీ సివిల్‌ కోర్టు

ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ

అక్టోబరు 27న స్వయంగా హాజరు కావాలని ఆదేశం

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

ఇటీవల తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా దూషించిన ఘటనను తీవ్రంగా పరిగణించిన కరీంనగర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్‌ బండారి వేణుకు లీగల్‌ నోటీసులు పంపిన ఆయన, హైదరాబాద్‌లోని సిటీ సివిల్‌ కోర్టులో దావా వేశారు. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ (ఓఎస్‌/342/2026) ను విచారించిన హైదరాబాద్‌లోని 11వ అడిషనల్‌ చీఫ్‌ జడ్జి (చార్మినార్‌, సిటీ సివిల్‌ కోర్టు) న్యాయస్థానం, బీజేపీ కార్పొరేటర్‌ బండారి వేణుకు సమన్లు జారీ చేసింది. అక్టోబరు 27, 2026 న ఉదయం 11 గంటలకు వేణు స్వయంగా కోర్టుకు హాజరై తనపై వచ్చిన ఆరోపణలు, క్లెయిమ్‌కు వివరణ ఇవ్వాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. తన వాదనకు మద్దతుగా అవసరమైన అన్ని పత్రాలు, ఆధారాలను ఆ రోజే కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. నిర్ణీత తేదీన (అక్టోబరు 27న) కోర్టుకు హాజరుకావడంలో విఫలమైతే, సదరు ప్రతివాది (బండారి వేణు) లేకుండగానే విచారణ పూర్తిచేసి తీర్పు వెలువరించడం జరుగుతుందని న్యాయస్థానం హెచ్చరించింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తీసుకున్న ఈ చట్టపరమైన నిర్ణయం, కోర్టు నేరుగా సమన్లు పంపడం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనడానికి ఈ ఘటనే నిదర్శనమని బీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటుండగా, ఈ కోర్టు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సోషల్‌ మీడియా వార్‌ నుంచి కోర్టు వరకు..

సోషల్‌ మీడియా వేదికగా మొదలైన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, బీజేపీ కార్పొరేటర్‌ బండారి వేణు మధ్య వివాదం ఇప్పుడు న్యాయస్థానం వరకు చేరింది. ఆగస్టులో వీరిద్దరి మధ్య సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకున్నాయి. మొదట బండారి వేణు, ఆయన సంబంధీకులకు చెందినదిగా ప్రచారంలోకి వచ్చిన ఫోన్‌ సంభాషనను బండి సంజయ్‌ ఫోటోతో క్లిప్‌ తయారుచేసి బూతు పురాణం అంటూ కేటీఆర్‌ ఫ్యాన్స్‌ ఆర్మీ పేరిట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై కార్పొరేటర్‌ బండారి వేణు ఘాటుగా స్పందించారు. తనపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ వర్గం దుష్ప్రచారం చేస్తుందని ఆరోపిస్తూ.. ఎమ్మెల్యేకు సంబంధించిన గతంలోని కొన్ని అభ్యంతర క్లిప్‌లను జతచేసి పరుషపదజాలంతో రూపొందించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. తదనంతరం బండారి వేణు చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కరీంనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్‌ఎస్‌ నేతలు వేణు నివాసం వద్దకు చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో గంగుల కమలాకర్‌ సివిల్‌ కేసు దాఖలు చేయడం, తాజాగా కోర్టు సమన్లు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయంగా పరస్పర విమర్శలతో ప్రారంభమైన వ్యవహారం ఇప్పుడు న్యాయపరమైన వివాదంగా మారింది. అక్టోబర్‌ 27న జరిగే విచారణలో బండారి వేణు హాజరు, ఆయన సమర్పించే పత్రాలు, కోర్టు తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement