కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్‌క్రైం: రైతులు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి యశ్వంత్ సింగ్ సూచించారు. కొత్తపల్లి రైతు వేదికలో మంగళవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు కోర్టు ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ఉచిత న్యాయవాది, న్యాయ సలహా పొందవచ్చన్నారు. న్యాయ సాయం కోసం 15100 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలన్నారు.
భరోసా కేంద్రంలో సేవలు పరిశీలన
కరీంనగర్‌లోని భరోసా కేంద్రాన్ని జిల్లా న్యా య సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ సందర్శించారు. రి కార్డులు పరిశీలించారు. మధ్యవర్తిత్వ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. జిల్లాలో 31 మంది శిక్షణ పొందిన న్యాయవాదులు మధ్యవర్తులుగా ఉన్నారన్నారు.
విజయవంతం చేయండి
కరీంనగర్ అర్బన్: గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ నూతన పాలక మండలి ఆధ్వర్యంలో జిల్లా మహాసభ ఈనెల 26న నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా చైర్మన్ బాషవేణి మల్లేశం యాదవ్ తెలిపారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో మహాసభ పోస్ట ర్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా రాష్ట్రమంత్రులు వాకాటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమైక్య ఫెడరేషన్ చైర్మన్ కె.సరిత తిరుపతయ్య, లైవ్ స్టాక్ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్, యాదవ కురుమ చైర్మన్ రఘునాథ్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు.
పత్తి కొనుగోళ్లు షురూ
జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్‌కు ఖరీఫ్ సీజన్‌లో కొత్త పత్తి ఉత్పత్తులను రైతులు తీసుకొచ్చారు. మంగళవారం మార్కెట్ చైర్‌పర్సన్ పూల్లూరి స్వప్న పూజలు చేసి కొనుగోళ్లను ప్రారంభించారు. క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,272 పలికింది. మార్కెట్‌కు ముగ్గురు రైతులు తొమ్మిది క్వింటాళ్లను తీసుకురాగా.. కనిష్ట ధర రూ.7,011కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. గ్రేడ్–2 కార్యదర్శి రాజా, అడ్తిదారులు సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.
లంచం అడిగితే సమాచారం ఇవ్వండి
గంగాధర: ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు, బిల్లులకు ఎవరైనా లంచం అడిగినా, పథకం అమలులో ఇబ్బందులకు గురిచేసినా ఫిర్యాదు చేయాలని తెలంగాణ హౌజింగ్ కార్పొరేషన్ విజిలెన్స్ అధికారి డి.నాగరాజు సూచించారు. ఒద్యారం గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహించారు. బిల్లుల చెల్లింపు విషయంలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసారా అని ఆరా తీశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తెలంగాణ హౌజింగ్ కార్పొరేషన్ అధికారులకు, టోల్‌ఫ్రీ నంబర్ 18005995991కు ఫిర్యాదు చేయాలని సూచించారు. హౌసింగ్ డీఈఈ వెంకటరమణ, ఏఈ యశ్వంత్, పంచాయతీ కార్యదర్శి శ్యామల పాల్గొన్నారు.
పిడుగుపాటుతో రైతు మృతి
చొప్పదండి: మండలంలోని చాకుంటకు చెందిన నరేందర్‌రెడ్డి (60) పిడుగు పాటుతో తన వ్యవసాయ పొలం వద్ద మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. నరేందర్ రెడ్డికి మండలంలోని వెదురుగట్ట శివారులో వ్యవసాయ పొలం ఉంది. మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగు మీద పడి మృతి చెందాడు. రాత్రి వరకు భర్త ఇంటికి రాకపోవడంతో భార్య మంగ కుటుంబసభ్యులతో కలిసి వ్యవసాయపొలం వద్దకు వెళ్లగా నరేందర్‌రెడ్డి విగతజీవిగా కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు.


