కరీంనగర్‌క్రైం: రూ.కోట్లలో పెట్టుబడి మోసానికి పాల్పడిన కేసులో కరీంనగర్ పోలీసులు ప్రధాన నిందితుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. సీపీ గౌస్ ఆలం మంగళవారం ఆయన కార్యాలయంలో నిందితుల అరెస్టు చూపించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శ్రేయ ఇన్‌ఫ్రా ఆండ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెట్టుబడి పథకాలు నిర్వహిస్తూ తక్కువ కాలంలో పెట్టుబడులను రెండు, మూడింతలు చేస్తామంటూ ప్రజలను నమ్మించి రూ.10కోట్ల నగదు సేకరించారు. 2020లో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఏర్పాటు చేసిన సంస్థ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఏజెంట్లను నియమించి పెట్టుబడులు సేకరించారు. నెట్‌వర్క్ చైన్ విధానంలో పాత పెట్టుబడిదారులకు చెల్లింపులు చేస్తూ మరికొంత మందిని ఆకర్షించారు. 2024 మే నుంచి చెల్లింపులు నిలిచిపోవడంతో పలువురు బాధితులు మోసపోయినట్లు గుర్తించా రు. బాధితుడు గుగులోత్ శివరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, సీపీ ఆదేశాలతో దర్యాప్తును సీపీఎస్‌కు బదిలీ చేశారు. సీసీఎస్ సీఐ ఆర్. ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి సెప్టెంబర్ 18న లక్నోలోని నిందితుల నివాసాల్లో దాడులు నిర్వహించింది. ప్రధాన నిందితుడు హేమంత్ కుమార్ రాయ్, రాజేష్ కుమార్, బ్రిజేష్ కుమార్ మిశ్రాలను అదుపులోకి తీసుకున్నారు. నేరానికి ఉపయోగించిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను లక్నో చీఫ్ జుడీషియల్ మే జిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన సీఐ ఆర్.ప్రకాశ్‌గౌడ్, ఎస్‌ఐ డి.మహిపాల్ రెడ్డిని సీపీ అభినందించారు. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌లో, సీసీఎస్ పోలీసులను సంప్రదించాలని సీపీ తెలిపారు.


