ఎన్‌హెచ్– 563పై 8 ఫుట్ ఓవర్‌బ్రిడ్జిలు
ప్రజలు ఫిర్యాదుల మేరకు ఏర్పాటు
రూ.18 కోట్ల అంచనా వ్యయం
వంతెనలు ఎక్కేందుకు మెట్రో తరహా లిఫ్టుల ఏర్పాటు
‘సాక్షి’ వరుస కథనాలకు స్పందించిన ఎన్‌హెచ్‌ఏఐ
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
వరంగల్– కరీంనగర్ నగరాలను కలిపే ఎన్‌హెచ్ 563 విషయంలో పాదచారులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. వరంగల్– కరీంనగర్ మధ్య దూరాన్ని 2 గంటల నుంచి 40 నిమిషాలకు కుదించిన ఈ ఫోర్‌లేన్‌పై పలు చోట్ల రోడ్డు దాటేందుకు ఇబ్బందులుగా ఉందని ఇటీవల భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ విషయమై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా స్పందించింది. రెండు జిల్లాలను కలుపుతూ దాదాపు 68 కిమీ మేర నిర్మించిన ఈ జాతీయ రహదారిపై దాదాపు 8 చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ముందుకొచ్చి ంది. ఆయా ప్రాంతాల్లో పాదచారులు భద్రంగా రోడ్డు దాటేందుకు అవకాశముంది. దివ్యాంగులు, ముసలి వాళ్లు ఎక్కేందుకు ఈ వంతెనలకు మెట్లతో పాటు లిఫ్టులు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలుకు ఉన్నట్లే ఇవి కూడా కాన్‌కోర్స్ తరహా లిఫ్టులు కావడం గమనార్హం.
దాదాపు రూ.18 కోట్ల వ్యయంతో..
భారత్ మాల యోజన కింద దాదాపు రూ.2,486 కోట్లకుపైగా వ్యయంతో చేపట్టిన 68 కిమీల పొడవైన ఎన్‌హెచ్– 563పై వాహనాలు గరిష్టంగా 100 కిమీ వేగంతో వెళ్లేలా నిర్మించారు. రహదారిపై 9 వంతెనలు, 23 చిన్న వంతెనలు, 5 బైపాస్ రోడ్లు, 25 అండర్ పాస్‌లు ఏర్పాటు చేశారు. సెప్టెంబరు మొదటివారం నుంచి ట్రయల్‌రన్‌కు అనుమతించారు. అధికారులు– ప్రజలకు సమన్వయ లోపంతో కొన్ని గ్రామాలకు ఈ రహదారి ప్రమాదకరంగా మారింది. రోడ్డు దాటేందుకు సరైన మార్గం లేకపోవడంతో వేలాదిమంది ఇబ్బందులు పడుతున్నారు. ట్రయల్ అనంతరం పలు గ్రామాల నుంచి భారీగా ఫిర్యాదులు రావడంతో 8 గ్రామాలను గుర్తించిన ఎన్‌హెచ్‌ఏఐ ఆయా గ్రామాల్లో పాదచారుల కోసం ఫుట్‌ఓవర్ బ్రిడ్జి (ఎఫ్‌వోబీ)లను దాదాపు రూ.18 కోట్ల అంచనావ్యయంతో నిర్మించనుంది. ఇవి కరీంనగర్ జిల్లాలో నాలుగు, హన్మకొండ జిల్లాలో మరో నాలుగు ఉండటం గమనార్హం.
పాదచారుల కోసమే: ఎన్‌హెచ్‌ఐఏ
‘రోడ్డు నిర్మాణం అనంతరం ఇటీవల ట్రయల్ రన్ మొదలు పెట్టాం. ఆయా గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పాదచారులకు ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తున్నాయో అధ్యయనం చేశాం. మొత్తం 8 గ్రామాల్లో ఎఫ్‌వోబీలు నిర్మించాలని నిర్ణయించాం. కేంద్రం నుంచి రూ.18 కోట్ల విడుదలకు రంగం సిద్ధమైంది. వీలైనంత త్వరగా ఆయా గ్రామాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపడతాం. ప్రతీ వంతెనకు మెట్లతోపాటు లిఫ్టులు ఏర్పాటు చేస్తాం. ఎన్‌హెచ్ 563 విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా మాకు తెలియజేయండి. సమస్యపై అధ్యయనం చేసి వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం’ అని ఎన్‌హెచ్‌ఏఐ అఽధికారులు ‘సాక్షి’కి తెలిపారు.
ఎఫ్‌వోబీలు నిర్మించే గ్రామాలివే..
శంకరపట్నం, శంషాబాద్, గొల్లపల్లి, కొత్తగట్టు, శాంతినగర్, కోతుల నడుమ, సూరారం,
బావుపేట


