శుఛీ.. రుఛీ | - | Sakshi
Sakshi News home page

శుఛీ.. రుఛీ

Sep 22 2026 12:30 AM | Updated on Sep 22 2026 12:30 AM

ఇన్‌చార్జి బాధ్యతలతో తనిఖీలెలా? అన్నింటా అన్‌సేఫే ఆరోగ్యానికి హానికరం ఎవరినీ వదలం

నాణ్యత డొల్ల.. ఆరోగ్యం కల్ల

అపరిశుభ్రత.. నాసిరకం పదార్థాలు

తనిఖీలు జరుగుతున్నా భయమేదీ?

ప్రజారోగ్యంతో వ్యాపారుల చెలగాటం

పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలోనూ అంతే..

కరీంనగర్‌ అర్బన్‌: కల్తీకి కాదేదీ అనర్హమన్నట్లు ఉంది అక్రమార్కుల తీరు. పాలు లేకుండా కోవ తయారు చేసే ఘనులకు జిల్లాలో కొదువ లేకపోగా నాణ్యత లేని ఆహార పదార్థాలను వడ్డిస్తూ ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారు. ఓ వైపు తనిఖీలు జరుగుతున్నా ఎలాంటి జంకు లేకపోవడం విస్తుగొల్పుతోంది. అనతికాలంలో సంపన్నులు కావాలనే దురాశకు తోడు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే తప్పవంటూ పక్కదారి పడుతున్నారు.

జిల్లాలో ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ అంకిత్‌రెడ్డి మాత్రమే తనిఖీలు నిర్వహిస్తున్నారు. గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ రోహిత్‌రెడ్డి, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ జోడు పదవులతో ఉన్నారు. రోహిత్‌రెడ్డి 5జిల్లాల వరకు ఇన్‌చార్జి కాగా ఫుడ్‌ కంట్రోలర్‌ 9 జిల్లాలకు ఇన్‌చార్జి. జిల్లా జనాభాకు అనుగుణంగా పోస్టులు లేకపోగా ఉన్న పోస్టులను ఇతర జిల్లాలకు మళ్లించడం ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోంది.

పలు హోటళ్లలో తనిఖీల సందర్భంగా సేకరించిన నమూనాల్లో అత్యధికం ఆరోగ్యానికి హానికరమని ఫలితాలొచ్చాయ్‌. నాణ్యత ప్రమాణాలు లేకపోవడం, మిస్‌బ్రాండ్‌ కేసులు నమోదవడం జిల్లాలో జరుగుతున్న కల్తీ, అక్రమ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. చిన్నపాటి తోపుడు బండ్ల నుంచి కార్పొరేట్‌ సూపర్‌ బజార్లు, చిన్న బజ్జీల బండి నుంచి ప్రముఖ హోటళ్ల వరకు కల్తీ సాధారణమైపోతుంది.

నిల్వ పదార్థాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. నూనెలో వేపిన మాంసాన్ని మళ్లీ వేయించడం వల్ల కేన్సర్‌ కారక వ్యాధులు వెంటాడే ప్రమాదముంది. ఎప్పటి ఆహార పదార్థాలను అప్పుడు తింటేనే శరీరానికి ఆరోగ్యం. ఫుడ్‌లో కలర్స్‌ వాడటం ప్రజారోగ్యంతో ఆటలాడటమే.

– సాయిని నరేందర్‌, ఎండీ చెస్ట్‌, క్రిటికల్‌ కేర్‌

ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించం. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. నాణ్యత ప్రమాణాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంతటివారినైనా వదలం. తనిఖీలు నిరంతరం జరుగుతుంటాయి.

– రోహిత్‌రెడ్డి, గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌

నగరంలోని ప్రముఖ బార్‌ ఇది. ఆహార పదార్థాలు తయారు చేసే ప్రాంతంలో అపరిశుభ్రంగా ఉంది. ముందు రోజు మిగిలిపోయిన బాయిల్డ్‌, చికెన్‌ ఐటమ్స్‌, కార్న్‌, వెజ్‌ ఐటమ్స్‌ వినియోగిస్తున్నారు. కేవలం ఇవి రెండే కాదు జిల్లా కేంద్రంలోని హెచ్చు హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో నాణ్యత డొల్ల.. ఆరోగ్యం కల్ల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement