భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు
గుర్రెపు డెక్క రాకుండా నెట్ ఏర్పాటుకు నిర్ణయం
నిమజ్జన పాయింట్లను పరిశీలించిన మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్
కొత్తపల్లి(కరీంనగర్): గణేశ్ నిమజ్జనోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. చింతకుంట కెనాల్, కొత్తపల్లి చెరువు నిమజ్జన పాయింట్లను సోమవారం డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, స్థానిక కార్పొరేటర్లు వాసాల రమేశ్, ప్రదీప్‌తో కలిసి పరిశీలించారు. ‘సమయం లేదు గణేశా’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించారు. కొత్తపల్లి నూతన నిమజ్జన పాయింట్ వద్ద ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గుర్రపు డెక్కను వలతో కట్టడి చేయాలని నిర్ణయించారు. లైటింగ్, తాగునీరు, పారిశుధ్యం వంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. చెరువులు, కెనాల్ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. నిమజ్జన పాయింట్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నగరపాలక సంస్థ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మానకొండూర్‌లో సాగుతున్న ఏర్పాట్లు
మానకొండూర్: మానకొండూర్ చెరువుకట్ట వద్ద నిమజ్జన ఏర్పాట్లు సాగుతున్నాయి. మున్సిపాలిటీ సిబ్బంది చెత్తను తొలగిస్తున్నారు. విద్యుత్ అధికారులు లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. క్రషర్ డస్టు పోసి చదును చేస్తున్నారు.


