చలో చింతకుంట ఉద్రిక్తం | - | Sakshi
Sakshi News home page

చలో చింతకుంట ఉద్రిక్తం

Sep 22 2026 12:30 AM | Updated on Sep 22 2026 12:30 AM

● ఎస్సారెస్పీ నీటి కోసం కదిలిన కాషాయ దండు ● నీటి విడుదలకు డిమాండ్‌... ● బీజేపీ నేతల అరెస్ట్‌

కొత్తపల్లి/కరీంనగర్‌ కార్పొరేషన్‌/కరీంనగర్‌: గణేశ్‌ నిమజ్జనోత్సవానికి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కరీంనగర్‌ నగర శివారులోని చింతకుంట కెనాల్‌ వద్ద బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. చింతకుంట వద్ద ప్రధాన రహదారులను దిగ్భందించి రాస్తారోకో చేపట్టారు. గణపతి బొప్పా మోరియా.. హిందూ పండుగలంటే చిన్నచూపా.. అంటూ రహదారిపై బైఠాయించారు. సుమారు గంటపాటు ఆందోళన చేపట్టిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పీటీసీకి తరలిస్తుండగా పోలీసు వాహనాలను నాయకులు అడ్డుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్‌ సునీల్‌ రావు, కరీంనగర్‌ పార్లమెంట్‌ కన్వీనర్‌ బోయినపల్లి ప్రవీణ్‌ రావు, కార్పొరేటర్లను పీటీసీ తరలించారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్‌పై లాఠీచార్జీ చేశారు. ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ హిందూ పండుగలంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరో పించారు. అర టీఎంసీ నీరు విడుదల చేయాలని కోరినా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. బీజేపీ కరీంనగర్‌ పార్లమెంట్‌ కన్వీనర్‌ బోయినపల్లి ప్రవీణ్‌రావు మాట్లాడుతూ ఎస్సారెస్పీలో నీటి నిల్వలు ఉన్నప్పటికీ నిమజ్జనానికి విడుదల చేయడంలో ఎందుకు ఆలస్యం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. నీటి విడుదలపై ఓ కాంగ్రెస్‌ నాయకుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు.

నిమజ్జన ఏర్పాట్లపై రాజకీయాలు తగవు..

గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్ల విషయంలో బీజేపీ అనవసర రాజకీయాలు చేస్తోందని సుడా మాజీ చైర్మన్‌ కె.నరేందర్‌ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి అనంతుల రమేశ్‌, కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, కార్పొరేటర్‌ వైద్యుల అంజన్‌కుమార్‌ మండిపడ్డారు. సోమవారం వేర్వేరుగా మాట్లాడుతూ కరీంనగర్‌లో గత కొన్నేళ్లుగా గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని, నిమజ్జనానికి నీటి విడుదల అంశాన్ని బీజేపీ రాజకీయం చేయడం సరికాదన్నారు. మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ల జోక్యంతో ఎస్సారెస్పీ నుంచి ప్రత్యేకంగా నీళ్లు విడుదల అయ్యాయని తెలిపారు. నీళ్లు మంగళవారం నాటికి చింతకుంటకు చేరుతాయని వెల్లడించారు. పవిత్రమైన పండుగలను రాజకీయాలకు వేదికగా మార్చడం బీజేపీ నాయకు లు మానుకోవాలని, ప్రజాసమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement