డీజేలు బంద్‌.. సోషల్‌ మీడియాపై నిఘా | - | Sakshi
Sakshi News home page

డీజేలు బంద్‌.. సోషల్‌ మీడియాపై నిఘా

Sep 13 2026 12:12 AM | Updated on Sep 13 2026 12:12 AM

డీజేలు బంద్‌.. సోషల్‌ మీడియాపై నిఘా 3వేల దరఖాస్తులు వచ్చాయి డీజేలకు అనుమతి లేదు నెగెటివ్‌ కామెంట్లపై దృష్టి నిమజ్జనానికి ఏర్పాట్లు చేశాం నిమజ్జనం పాయింట్ల్లు ఇవే సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: గణేశ్‌ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం సూచించారు. చవితి నుంచి నిమజ్జనం వరకు శాంతిభద్రతల పరంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మండపాల దరఖాస్తు నుంచి గణనాథులు గంగమ్మ ఒడికి చేరే వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని శాఖలతో సమన్వయంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఇప్పటికే పీస్‌ కమిటీ, మండపాల నిర్వాహకులతో అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. సోషల్‌ మీడియాపై 24 గంటల పూర్తి నిఘా ఉంచామని, వదంతులు వ్యాపింపజేయాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టంచేశారు. చవితి నుంచి నిమజ్జనం వరకు కరీంనగర్‌ కమిషనరేట్‌ పోలీసులు ఏమేం చర్యలు చేపట్టారో శనివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

గణేశ్‌ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలి

జిల్లాలో 3000 మండపాలకు దరఖాస్తులు

మండపాల్లో సీసీ కెమెరా, ఫైర్‌సేఫ్టీ తప్పనిసరి

సోషల్‌ మీడియాపై ‘సహయోగ్‌’ద్వారా నిరంతర నిఘా

నిమజ్జనం రోజు 24 గంటల జాయింట్‌ కంట్రోల్‌ రూం

‘సాక్షి’ ఇంటర్వ్యూలో పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం

ఈసారి గణేశ్‌ మండపాల కోసం 3వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. అందులో 1000వరకు ఆన్‌లైన్‌లో, మిగిలినవి ఆఫ్‌లైన్‌లో వచ్చాయి. అన్నింటికి అనుమతులు ఇచ్చాం. నిమజ్జనం ఏ రూట్లో వెళ్లాలి? ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర అంశాలపై అవగాహన కల్పించాం. మండపాల వద్ద ఏ ర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాం. మండపాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేశాం. ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు, ఏర్పాట్లు వివరిస్తూ గైడ్‌లైన్‌ బుక్‌లు ఇచ్చాం. ప్రతీరోజూ ఒక భక్తుడు మండపంలో నిద్రించాలి.

ఆసుపత్రులు, కొన్ని సున్నిత ప్రాంతాల వద్ద ఇబ్బందులు కలిగే నేపథ్యంలో డీజేలకు అనుమతి లేదు. సాధారణ స్పీకర్లు వాడుకోవచ్చు. నిమజ్జన కేంద్రాల వద్ద ఏర్పాట్ల విషయంలో మైనింగ్‌ (క్రేన్లు), అంబులెన్స్‌ (హెల్త్‌), శానిటేషన్‌ (మున్సిపల్‌), లైటింగ్‌ (ఎలక్ట్రిసిటీ), రోడ్లు (ఆర్‌ అండ్‌ బీ), ఆర్టీసీ, అగ్నిమాపక, ఇరిగేషన్‌ అన్నిశాఖలతో సమన్వయం చేస్తున్నాం. కమిషనరేట్‌ పరిధిలో అవకాశమున్న మూడు సున్నిత ప్రాంతాలను గుర్తించి, ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం.

పండుగ నేపథ్యంలో సోషల్‌ మీడియాపై నిరంతరం నిఘ ఉంది. సహయోగ్‌ పోర్టల్‌ ద్వారా కమిషనరేట్‌ పరిధిలోని సోషల్‌ మీడియాపై 24 గంటల నిఘా పెట్టాం. ఎలాంటి వదంతులు, నెగెటివ్‌ కామెంట్లు పెట్టినా చర్యలు తీసుకుంటాం. కంటెంట్‌ను వెంటనే డిలిట్‌ చేస్తాం. వదంతులు నమ్మొద్దు. ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తినా సమీపంలోని పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. మండపాల వద్ద ప్రతీ రోజు గస్తీ నిర్వహిస్తాం. బైక్‌ పెట్రోలింగ్‌ టీంలు, పెట్రోకార్లతో 24 గంటలపాటు గస్తీకి ఏర్పాటు చేశాం.

నిమజ్జనం రోజూ ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఎలక్ట్రిసిటీ, హెల్త్‌, పోలీస్‌, ఫైర్‌, మున్సిపల్‌, ఇరిగేషన్‌, మైనింగ్‌, ఆర్టీసీ, ఆర్‌అండ్‌ బీ తదితర శాఖలతో కలిసి జాయింట్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నాం. ఆయాశాఖల సిబ్బంది 24 గంటలపాటు మూడు షిప్టుల్లో అందుబాటులో ఉంటారు. శోభాయాత్ర నుంచి నిమజ్జన పాయింట్ల వరకు ఎక్కడ ఏ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కారం చేసేలా ప్రణాళికలు రూపొందించాం.

చింతకుంట, మానకొండూరు వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్తపల్లి చెరువు వద్ద రోడ్డు ఇరుకుగా ఉండటంతో విగ్రహాలతో వచ్చే వాహనాల ఎంట్రీ, ఎగ్జిట్‌లకు లక్ష్మీపూర్‌ వైపుగా ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నాం. ఇందుకోసం కలెక్టర్‌, ఇతర శాఖల అధికారులతో కొత్తపల్లి చెరువును పరిశీలించాల్సి ఉంది. ఇక్కడ అనుమతి వస్తే.. 300 వరకు విగ్రహాలు నిమజ్జనం చేసే వీలు దొరుకుతుంది. నిమజ్జనం రోజు మూడు నుంచి ఐదు ప్లాటూన్ల అదనపు బలగాలు వచ్చే అవకాశముంది.

సీపీ

గౌస్‌ ఆలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement