● జిల్లా జడ్జి ఎస్.శివకుమార్
కరీంనగర్‌క్రైం: రాజీ ద్వారా కేసులు సత్వరం పరిష్కారం అవుతాయని, అందుకు లోక్ అదా లత్ సరైన వేదిక అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్.శివకుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదన్‌లో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 4,384 కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. వీటిలో సివిల్ 19, క్రిమినల్ 4,241, సైబర్ క్రైం 15, కోర్టుకు రాని కేసులు 50 పరిష్కరించినట్లు తెలిపారు. మోటారు ప్రమాద కేసులు 59 పరిష్కరించి, బాధితులకు రూ.3,27,43,000 పరిహారం అందిచినట్లు పేర్కొన్నారు. రాజీ ద్వారా కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలనుకునే వారు పోలీ సు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని సూచించారు. సీసీఆర్‌బీ ఏసీపీ శ్రీనివాస్‌జీ మాట్లాడుతూ లోక్ అదాలత్‌లలో రాజీ చేయదగిన క్రిమినల్ కేసుల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తున్నామన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యశ్వంత్ సింగ్ పాల్గొన్నారు.
సమయపాలన పాటించాలి
కరీంనగర్: జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాల ని, లేకుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజగోపాల్ రావు ఆదేశించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యం కోసం వచ్చే వారికి తప్పనిసరి అందుబాటులో ఉండాలన్నారు. శనివారం నగరంలోని బుట్టి రాజారాంకాలనీ పీహెచ్‌సీతో పాటు పలు ఆస్పత్రులను సందర్శించి వైద్యులతో మాట్లాడారు. హాజరు రిజిస్టరు పరిశీలించారు.
అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని ఆందోళన
మానకొండూర్: మండలంలోని శ్రీనివాస్‌నగర్ శివారులో నేషనల్ హైవే 563పై గ్రామానికి చెందిన మహిళలు ఆందోళన చేపట్టారు. నేషనల్ హైవేతో వ్యవసాయ పొలాలకు రాకపోకలు దూరమయ్యాయని, అండర్‌పాస్‌లు ఏర్పా టు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో రెండు అడుగుల దూరంలో ఉన్న వ్యవసాయ భూములు ఇప్పుడు 3 కిలోమీటర్ల దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల వద్దకు ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, హార్వేస్టర్లు వెళ్లేలా అండర్‌పాస్ ఏర్పాటు చేయాలన్నారు. అక్కడికి చేరుకున్న నేషనల్ హైవే సిబ్బంది సానుకూలంగా స్పందించడంతో ఆందోళన విరమింపజేశారు.
బర్త్ సర్టిఫికెట్.. బహుపరాక్
కరీంనగర్ అర్బన్: జనన, మరణ ధ్రువీకరణ పత్రం ఇక మరింత కఠినతరమైంది. వయసు ఎక్కువుంటే ఆర్డీవో ద్వారా తీసుకుంటామనుకుంటే పొరపాటే. మారిన నిబంధనల క్రమంలో బర్త్ సర్టిఫికెట్ కావాలంటే కోర్టును ఆశ్రయించాల్సిందే. జనన ఽధ్రువీకరణ పత్రాల జారీలో భారత ప్రభుత్వం మార్పులు చేయగా జిల్లా యంత్రాంగానికి ఆదేశాలిచ్చింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్‌త్స్ అండ్ డెత్స్(అమెండ్‌మెంట్) యాక్ట్ 2026 ప్రకారం జనన, మరణాల ఆలస్య రిజిస్ట్రేషన్‌కు సంబంధించి నిబంధనలు మార్చారు. జననం లేదా మరణం జరిగి రెండు సంవత్సరాలలోపు అయితే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అంటే ఆర్డీవో ధ్రువపత్రాన్ని జారీ చేస్తారు. అలాగే జననం లేదా మరణం జరిగి రెండు సంవత్సరాలు దాటితే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ జారీ చేయనున్నారు. రికార్డులను పరిశీలించి నిర్ధారణ అయితేనే ఽధ్రువపత్రం జారీ చేస్తారు.


