నోటరీ పేరిట టోకరా | - | Sakshi
Sakshi News home page

నోటరీ పేరిట టోకరా

Sep 8 2026 12:41 AM | Updated on Sep 8 2026 12:41 AM

స్టాంప్‌ పేపర్ల విక్రయాల్లో ఇష్టారాజ్యం

అఫిడవిట్లకు అడ్డగోలు ఫీజులు

రూ.500 నుంచి రూ.1,500 వరకు చార్జీలు

అమాయకులే టార్గెట్‌గా వసూళ్లు

హుజూరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం అవసరమైంది. నోటరీ చేయించేందుకు వెళ్లగా స్టాంప్‌ పేపర్‌పై టైప్‌ చేసి, న్యాయవాది అటెస్టెడ్‌ సంతకంతో పత్రం ఇస్తామని చెప్పి రూ.1,500 డిమాండ్‌ చేశారు. ఆశ్చర్యపోయిన సదరు వ్యక్తి మరోచోట సంప్రదించి రూ.500కు నోటరీ చేయించుకున్నట్లు పేర్కొన్నాడు. నోటరీ సేవలకు వేర్వేరు చోట్ల వేర్వేరు రుసుం వసూలు చేస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది.

హుజూరాబాద్‌: ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలన్నా.. కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలన్నా.. ఆస్తులు, బ్యాంకు ఖాతాల్లో నగదు తదితర వ్యవహారాల్లో పత్రాలు సమకూర్చుకోవాలన్నా నోటరీ అవసరం. ఈ అవసరాన్ని కొందరు స్టాంప్‌ పేపర్‌ విక్రయదారులు, టైప్‌ ఇన్‌స్టిట్యూట్లు, ఆన్‌లైన్‌ సేవా కేంద్రాల నిర్వాహకులు ఆసరాగా చేసుకుంటున్నారు. నోటరీ, అఫిడవిట్‌ పేరుతో ప్రజల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు.

ఒక్కో పనికి.. ఒక్కో లెక్క

ప్రజలకు నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్ల వినియోగంపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో మధ్యవర్తులు, టైపింగ్‌ కేంద్రాల నిర్వాహకులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీంతో సాధారణ నోటరీ అఫిడవిట్‌ కోసం ప్రజలు రూ.500 నుంచి రూ.1,500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందంది. నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్ల విక్రయం నమోదైన స్టాంప్‌ వెండర్ల ద్వారా జరగాల్సి ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు, టైప్‌ ఇన్‌స్టిట్యూట్లు, ఆన్‌లైన్‌ సేవా కేంద్రాల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి వాస్తవాలను తేల్చాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పత్రాలు సమర్పించాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు నోటరీ సేవలను ఆశ్రయిస్తున్నారు. ఏ పత్రానికి ఎంత విలువైన స్టాంప్‌ పేపర్‌ అవసరం? నోటరీకి ఎంత రుసుం? వంటి విషయాలపై స్పష్టత లేకపోవడంతో అడిగిన మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోందని బాధితులు చెబుతున్నారు.

అధికారుల పర్యవేక్షణ ఏది?

నోటరీ సేవలు, స్టాంప్‌ పేపర్ల విక్రయాలపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా స్టాంప్‌ పేపర్ల విక్రయాలు జరుగుతున్నాయా? నిర్ణీత రుసుములకు మించి వసూళ్లు చేస్తున్నారా? అనే అంశాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement