ఉపాధి కల్పనలో ప్రజాభిప్రాయానికే పెద్దపీట ఈ నెల 15లోగా వీబీ జీ రాం జీ గ్రామసభల నిర్వహణ తదుపరి పనుల ప్రణాళిక రూపకల్పన
కరీంనగర్ అర్బన్: కూలీల ఉపాధి కల్పనలో వారి అభిప్రాయానికే పెద్దపీట వేయనున్నారు. ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రారంభమైన వీబీ జీ రాంజీ పథకంలో వికసిత్ భారత్– 2047 లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణాభివృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తుండగా ఈ నెల 15లోగా పూర్తి చేయనున్నారు. గ్రామ పంచాయతీల వారీగా 2026– 2027 సంవత్సరానికి చేపట్టాల్సిన పనులను గుర్తించి, ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. నిబంధనలకు అనుగుణంగా నాలుగు కేటగిరిల్లో జాబితా సిద్ధం చేసి 2027 మార్చి నాటికి పనులను పూర్తి చేయనున్నారు.
నాలుగు విభాగాలకు ప్రాధాన్యం
వీబీ జీ రామ్ జీ పథకంలో భాగంగా 318 పనులను అధికారులు సూచిస్తున్నారు. వీటిని నాలుగు విభాగాలుగా చేశారు. నీటి భద్రత, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధి వసతులు, విపత్తుల నివారణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని పనులు గుర్తించనున్నారు. గ్రామంలో ఎంపీడీవో లేదా ఏపీవో లేదా టీఏలతో బృందాలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో మొదటి, తుది గ్రామసభలు నిర్వహించాలి. మొదటి గ్రామసభలో వీబీ జీ రామ్ జీ ద్వారా కల్పించే పనులపై కూలీలకు అవగాహన కల్పించాలి. వివిధశాఖల అధికారులు విధిగా హాజరై తమశాఖకు అవసరమైన పనులు గుర్తించి ప్రణాళికలో చేర్పించాలి. తుది గ్రామసభలో గుర్తించిన పనులను ప్రాధాన్యత క్రమంలో సూచిస్తూ వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల ఆమోదం చేపట్టాలి. చివరి గ్రామ సభలో ప్రతిపాదిత పని పేరు, లబ్ధిదారుడి వివరాలు, అంచనా వ్యయం, చేపట్టబోయే శాఖ, పనులు చేపట్టే ఆర్థిక సంవత్సరం వివరాలను రూపొందించాలి.
బృందాల వారీగా పనుల గుర్తింపు
వీబీ జీ రామ్ జీలో ప్రస్తుతం 22 శాఖలను అనుసంధానం చేశారు. ప్రధానంగా పంచాయతీ రాజ్, అటవీ, సెర్ప్, వ్యవసాయం, విద్య, మత్స్య, ఉద్యాన శాఖ, టీజీ రెడ్కో, డెయిరీ, గహనిర్మాణ, సెరీకల్చర్, ఎస్బీఎం తదితర శాఖలను అనుసంధానం చేస్తూ పనులను కల్పించనున్నారు. జిల్లాలోని 16 మండలాల్లో 1,51,654 జాబ్‌కార్డులుండగా 2,95,543 మంది కూలీలు నమోదై ఉన్నారు. ఇందులో 1,03,901 జాబ్‌కార్డుల్లోని కూలీలు పనులకు వస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సొంతూళ్లకు చేరుకుని ఉపాధి పనులకు వస్తుండటంతో కొత్తగా 13212 జాబ్‌కార్డులను అధికారులు మంజూరు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 90454 కుటుంబాల్లోని 12112 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవగా 31,90,032 పనిదినాలు కల్పించారు. 12012 పనులను చేపట్టి 6వేలకు పైగా పనులను పూర్తి చేశారు. మిగతా పనులు కొనసాగుతుండగా కూలీలకు వేతన రూపంలో రూ.81.01కోట్లు అందించారు. ఈ సారి పెరిగిన కూలీల పని డిమాండ్‌కు అనుగుణంగా పనిదినాలను కల్పించేలా పనుల ప్రణాళికను తయారు చేయనున్నారు.
గుర్తించనున్న పనులివే
గ్రామాభివృద్ధికి ఉపయోగపడే పనులను గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు. నీటి సంరక్షణ పనులు, నీటిపారుదల కాలువల పూడికతీత, కందకాలు, నీటి కుంటలు, సమగ్ర భూ అభివృద్ధి పనులు, పశు సంబంధిత పనులు, గ్రామీణ పారిశుధ్యం, హరితహారం, రహదారుల అనుసంధానం, పంట నూర్పిడి కల్లాలు, ఎండిపోయిన బావుల రీచార్జి తదితర పనుల గుర్తింపు చేపడుతున్నారు. పనుల గుర్తింపు తరువాత జీపీఎస్ కోఅర్డినేట్ చేయనున్నారు. పనులు చేసే ప్రదేశానికి వెళ్లి యాప్‌లో చిత్రాన్ని అప్‌లోడ్ చేయడం ద్వారా అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా పనులు గుర్తించిన ప్రదేశం తెలుస్తుంది. ఉపాధి పనుల్లో పారదర్శకత కోసం ఈ విధానం అవలంభిస్తున్నారు. గ్రామ సభల తీర్మాణం మేరకు పనులను గుర్తిస్తామని, కూలీలకు చేతినండా పని దొరికేలా ప్రణాళికలు రచిస్తున్నామని అధికారులు వివరించారు.


