కరీంనగర్ టౌన్: ఏఐటీయూసీ 4వ రాష్ట్ర మహాసభలు కరీంనగర్‌లో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, ఎర్రజెండాలతో బస్టాండ్ నుంచి పూలే మైదానం వరకు నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. అక్కడ నిర్వహించిన బహిరంగసభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ జిత్ కౌర్ మాట్లాడుతూ కార్మిక హక్కుల సాధనకు పోరాటమే శరణ్యం అన్నారు. నాలుగు లేబర్ కోడ్‌లను తెచ్చి కార్మికుల గొంతు నొక్కుతున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెడుతూ కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, వరల్డ్ ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి సి.శ్రీకుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలవేన శంకర్, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ కార్మిక హక్కుల సాధనకు రణభేరి మోగిస్తామన్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్, టేకుమల్ల సమ్మయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు వీఎస్.బోస్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ.యూసఫ్, ఎస్.బాల్‌రాజ్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్‌కుమార్, బోయిని అశోక్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి పాల్గొన్నారు.


