కరీంనగర్ టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకిచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రమాద బీమా యథావిధిగా కొనసాగించాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. గంగుల కమలాకర్ ర్యాలీలో ఆటో నడిపి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు వెంటనే ఇవ్వాలన్నారు. ప్రమాద బీమాను యథావిధిగా కొనసాగించాలన్నారు. చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, సంఘం ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ పటేల్, నాయకులు కొత్తూరు సత్యనారాయణ, నరసింహనాయక్, వడ్లకొండ శ్రీనివాస్‌గౌడ్, రమేశ్, అఫ్జల్‌బేగ్, మహమ్మద్ యాకూబ్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.


