అనుమతుల ఉల్లంఘన/అక్రమ నిర్మాణాలు : 53 నోటీసులు జారీ : 53 కూల్చివేత, అంతస్తులు సీజ్ : 13 శిథిలభవనాల సంఖ్య : 120 తొలగించినవి: 15
నగరపాలకసంస్థ 57వ డివిజన్ పరిధిలోని గణేశ్‌నగర్ బైపాస్ రోడ్డులో ఉన్న ఈ భవనం చూశారు కదా. కేవలం 69 గజాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఆరంతస్తుల భవనం. రెండు అంతస్తులకు అనుమతి తీసుకొని, ఆరంతస్తులు నిర్మిస్తున్నారని, కూలి పోతే తమ ప్రాణా లు పోయే ప్రమాదం ఉందని పక్కన ఉన్న ఇండ్ల యజమానులు ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం శూన్యం. గోడల నిర్మాణ సమయంలో మున్సిపల్ అధికారులు భవనాన్ని సీజ్ చేస్తే, ప్రస్తుతం రంగుల ఎలివేషన్‌తో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ఇండ్లు, బహుళఅంతస్తులు, అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి ప్రభుత్వపరంగా నిబంధనలు ఉన్నాయి. ఎంత వైశాల్యం ఉన్న రోడ్డులో ఎన్ని అంతస్తుల భవనం నిర్మించాలి, ఎంత మేరకు సెట్‌బ్యాక్ తీసుకోవాలి, ప్రమాదాల సమయంలో ఫైర్‌ఇంజిన్, అంబులెన్స్ తిరిగేట్లు స్థలం, రోడ్లు ఉన్నాయా లేదా లాంటి నిబంధనల మేరకు నగరపాలకసంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కాని నిబంధనలు కాగితాలు దాటడం లేదు. వివాదాస్పద స్థలాల్లో అక్రమ నిర్మాణాలు, ఒకటి, రెండు అంతస్తులకు అనుమతి తీసుకొని ఐదారు అంతస్తులు నిర్మించడం ప్రస్తుతం నగరంలో ‘మామూలు’గా మారింది. నగరంలో అధి కారికంగా గుర్తించిన అనుమతి లేని, అక్రమ నిర్మాణాలు 53 వరకు ఉండగా, ‘అధికారికంగా గుర్తించని’ అక్రమనిర్మాణాలు వందలసంఖ్యలో ఉంటాయి. 53 భవనాల్లోనూ కేవలం 13 నిర్మాణాలు మాత్రమే అధికారులు తొలగించారు. ఇందులోనూ ఎక్కువగా కోర్టు ఆదేశాల మేరకే కూల్చినవే.
సిబ్బందే ఏజెంట్లు
పట్టణ ప్రణాళిక విభాగంలో ఏజెంట్ల బాగోతం పెచ్చుమీరుతోంది. కొంతమంది అధికారులు కిందిస్థాయి సిబ్బందిని ఏజెంట్లుగా మార్చుకొని అక్ర మ వసూళ్లకు పాల్పడుతున్నారు. భవన నిర్మాణ అ నుమతులు ఇవ్వాలన్నా, అక్రమ నిర్మాణాలు, అనుమతి లేని అంతస్తులపై చర్యలు తీసుకోవద్దన్నా ఏజెంట్లుగా మారిన సిబ్బందిని నిర్మాణదారులు కలవాల్సిందే. ఫైల్‌కు అనుగుణంగా ముడుపులు ముడితేనే అధికారి ఫైల్‌ను ఆన్‌లైన్‌లో ఆమోదిస్తా రు. చైన్‌మెన్లు, సహాయకులు, డ్రైవర్లు సంబంధిత అధికారులకు ఏజెంట్లు కాగా, కొన్ని చోట్ల ప్రైవేట్ ఇంజినీర్లు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు నోటీసులివ్వడం నగరపాలకసంస్థలో అవినీతి వ్యవహారానికి ద్వారాలుగా మారాయి. నోటీసు ఇచ్చామంటే కాసులు కురవాల్సిందే అన్న చందంగా పరిస్థితి తయారైంది. నగరంలో చాలా భవనాలకు నోటీసులిస్తున్నా చర్యలు శూన్యం.
రాజకీయ ఒత్తిళ్లు
అక్రమ నిర్మాణాలకు రాజకీయ ఒత్తిళ్లూ కారణమవుతున్నాయి. కొంతమంది కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు అక్రమాలకు దన్నుగా నిలుస్తున్నారు. ఫిర్యాదులతో అధికారులు చర్యలు తీసుకొనేందుకు వెళ్తే ‘ఇక్కడ మీరు ఏం చేసేది లేదు’..అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. వినకపోతే తమ పార్టీ పెద్ద నేతలతో ఫోన్లు చేయిస్తున్నారు.
శిథిల భవనాలు 120
నగరంలో శిథిలావస్థలో ఉన్న 120 భవనాలను అధికారులు గుర్తించారు. ఇందులో 15 భవనాలు మరీ అధ్వానంగా ఉండడంతో తొలగించారు. మిగతా 105 భవనాల్లో నివాసితులకు హెచ్చరికలు జారీ చేశారు. అవి ఇప్పటికప్పుడు పడిపోయే అవకాశం లేకపోయినా, వరుసగా వర్షాలు కురిస్తే ప్రమాదాలకు అవకాశం ఉంది అవసరమైతే వాటిని తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు.
ప్రాసిక్యూట్ చేస్తాం
గణేశ్‌నగర్‌లో 69 గజాల్లో నిర్మించిన ఆరంతస్తుల భవనంపై ఫిర్యాదులు రావడంతో చర్యలు చేపట్టాం. రెండు అంతస్తులు అనుమతులు తీసుకొని, ఆరు అంతస్తులు నిర్మించడంతో ఆ భవనాన్ని గతంలో సీజ్ చేశాం. తిరిగి వినియోగిస్తుండడంపై న్యాయపరంగా చర్యలు చేపట్టబోతున్నాం. హైదరాబాద్ తరహాలో ఏదైనా ఘటన జరిగిన తరువాత హడావుడి పడేకన్నా, ముందే అక్రమ నిర్మాణాలను అరికడితే ప్రణాళికబద్ధమైన నగరాన్ని ప్రజలకు అందించొచ్చు.
– వేణు, ఏసీపీ, నగరపాలకసంస్థ


