జిల్లాలో 2026లో మొదటి ఆరు నెలల్లో మహిళలపై జరిగిన నేరాలు
కరీంనగర్‌క్రైం: కమిషనరేట్ పరిధిలో మహిళలపై అత్యాచార కేసులు పెరుగుతున్నాయి. తీవ్ర నేరమై న అత్యాచార కేసులు ఏకంగా 55.6 శాతం పెరిగా యి. 2025లో జనవరి– జూన్‌తో పోలిస్తే 2026 తొలి ఆరునెలల్లో మహిళలపై నమోదైన మొత్తం కేసులు 321 నుంచి 328కి పెరిగాయి. అత్యాచార కేసులు మాత్రం 18 నుంచి 28కి పెరగగా, ఇంకా 26 దర్యాప్తులోనే ఉండడం గమనార్హం. బాలలపై లైంగిక నేరాలు 35 నుంచి 36కు పెరిగాయి. మొత్తం దర్యాప్తులో ఉన్న కేసులు 254 నుంచి 257కు మాత్రమే పెరిగినా, అత్యాచార కేసుల్లో దర్యాప్తులో ఉన్న కేసుల శాతం అధికంగా ఉంది. మహిళలపై నేరాల మొత్తం సంఖ్య కంటే నేరాల స్వభావంలో చోటుచేసుకున్న ఈ మార్పే ఇప్పుడు పోలీసు యంత్రాంగానికి సవాల్‌గా మారింది.
పెరిగిన గృహహింస..
మహిళల గౌరవానికి భంగం కలిగించే నేరాలు 116 నుంచి 111కు తగ్గాయి. 5 కేసులు తగ్గడంతో సుమారు 4.3 శాతం క్షీణత నమోదైంది. గృహహింసకు సంబంధించి కేసులు 149 నుంచి 153కు పెరిగాయి. అంటే 4 కేసులు అదనంగా నమోదై 2.7 శాతం పెరుగుదల నమోదైంది.
93 శాతం దర్యాప్తులోనే..
2025 జూన్ నాటికి మహిళలపై నేరాలకు సంబంధించి 254 కేసులు దర్యాప్తులో ఉండగా, 2026 జూన్ నాటికి ఈ సంఖ్య 257కు చేరింది. ఇది 1.18 శాతం పెరుగుదల. కేసుల స్వభావాన్ని పరిశీలిస్తే 2026లో నమోదైన 28 అత్యాచార ఘటనల్లో 26 కేసులు దర్యాప్తులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2025లో నమోదైన 18 అత్యాచార కేసుల్లో 17 దర్యాప్తులో ఉన్నాయి. అంటే అత్యాచార కేసుల సంఖ్య పెరగడమే కాకుండా, వాటిలో అత్యధిక కేసులు ఇంకా దర్యాప్తు దశలోనే ఉండడం గమనార్హం. ఇది దర్యాప్తులో వేగం, చార్జీషీట్‌ల దాఖలు, బాధితులకు సకాలంలో న్యాయం అందే పరిస్థితులపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.
పోక్సో కేసుల్లోనూ అంతే..
2026లో నమోదైన 36 బాలలపై లైంగిక నేరాల కేసు(పోక్సో)ల్లో 29 దర్యాప్తులో ఉన్నాయి. అంటే దాదాపు 81 శాతం కేసులు దర్యాప్తు దశలోనే ఉన్నా యి. ఈ కేసుల్లో దర్యాప్తు ఆలస్యం కాకుండా సాక్ష్యా ల సేకరణ, వైద్య పరీక్షలు, బాధితుల వాంగ్మూలం, అభియోగపత్రాల దాఖలుపై శ్రద్ధ అవసరం. గృహ హింస కేసులు విషయానికి వస్తే నమోదైన కేసులు 149 నుంచి 153కు పెరిగినా.. దర్యాప్తులో ఉన్న కేసులు మాత్రం 133 నుంచి 126కు తగ్గాయి. బాలలు, మహిళల నేరాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధతో కృషిచేయాలని, కేసుల దర్యాప్తులో వేగం పెంచి నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూడాలని మహిళలు కోరుతున్నారు.
అత్యాచార కేసులు 28
దర్యాప్తులో ఉన్నవి 26
బాలలపై లైంగిక నేరాలు 36
దర్యాప్తులో ఉన్న బాలలపై లైంగిక నేరాల కేసులు 29
మహిళా గౌరవానికి భంగం కలిగించే నేరాలు 111
గృహహింస కేసులు 153


