కొత్త పింఛన్ దరఖాస్తులపై నజర్ కలెక్టర్ చిత్రామిశ్రా వినూత్న నిర్ణయం వార్డులు, గ్రామాల వారీగా సర్వే అర్హులుంటే అర్జీ పెట్టుకునేందుకు సహకారం
కరీంనగర్ అర్బన్: హలో.. నమస్తే.. బాగున్నారా.. మీ ఇంట్లో పింఛన్‌కు అర్హత గలవారున్నారా? సంబంధిత సర్టిఫికెట్లు ఉన్నాయా? అయితే ఒకసారి వచ్చి కలవండి. పింఛన్‌కు దరఖాస్తు చేద్దాం. ప్రస్తుతం జిల్లాలో వినిపిస్తున్న మాట. అర్హత ఉన్న ఏ ఒక్కరూ పింఛన్‌కు దూరం కావొద్దన్న ధృడ సంకల్పంతో కలెక్టర్ చిత్రామిశ్రా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టణం, గ్రామం తేడా లేకుండా క్షేత్రస్థాయి అధికారులు‘చేయూత’కు అర్హులపై ఆరా తీస్తున్నారు. ఒక్కరూ మిస్సయినా ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించడంతో అంగన్‌వాడీలు, ఆశాకార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నారు.
గుర్తింపు.. దరఖాస్తు
కొత్త ‘చేయూత’ పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అవకాశమివ్వగా కలెక్టర్ చిత్రా మిశ్రా అర్హులతో దరఖాస్తు చేయించే ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఇతర ప్రభుత్వ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఎవరు పింఛను అర్హులు? ఎవరు ఇప్పటి వరకు దరఖాస్తు చేయలేదు? ఎవరి వద్ద అవసరమైన పత్రాలు లేవు? అనే అంశాలను గుర్తించి వివరాలు సేకరిస్తున్నారు. అర్హులతో దరఖాస్తు చేయించడంతోపాటు ఫారం ఎలా నింపాలి? ఏ పత్రాలు అవసరం? వాటిని ఎలా సిద్ధం చేసుకోవాలి? అనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
ధ్రువపత్రాలకు చేయూత.. హెల్ప్‌డెస్క్‌లు
చేయూత పింఛన్ కోసం వచ్చేవారిని ధ్రువపత్రాలు లేవనే కారణంతో కార్యాలయాల చుట్టూ తిప్పవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. అవసరమైన పత్రాల వివరాలను ముందుగానే తెలియజేసి సమకూర్చుకునేందుకు సహకరించాలని ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థతోపాటు హు జూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లో వార్డులవారీగా హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు.
ఎప్పటికప్పుడు సమీక్ష
పింఛన్ల దరఖాస్తు ప్రక్రియపై కలెక్టర్ చిత్రామిశ్రా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులతో సమీక్షించగా ప్రగతిని ఆరా తీస్తున్నారు. డీఆర్డీవో, జిల్లా సంక్షేమ అధికారి, డీపీవో, మెప్మా పీడీ, మున్సిపల్ కమిషనర్లు తదితర అధికారులతో సమావేశమై అర్హుల గుర్తింపు, దరఖాస్తుల స్వీకరణ, ధ్రువపత్రాల సమీకరణ, క్షేత్రస్థాయి సర్వేపై పలు కీలక సూచనలు చేశారు. జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని, అర్హులైన ఒక్క లబ్ధిదారుడు కూడా మిగిలిపోకుండా అధికారులు బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేస్తున్నారు.
ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు
చేయూత పింఛన్లకు అర్హుల నుంచి ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీతకార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హీమోఫీలియా వంటి రక్తసంబంధిత వ్యాధులతో బాధపడుతున్న దివ్యాంగులకు తొలి దశలో ప్రాధాన్యత ఇవ్వనున్నా రు. దరఖాస్తుల స్వీకరణతో పాటు ఆన్‌లైన్ డేటా నమోదు, క్షేత్రస్థాయి పరిశీలన, అర్హుల జాబితా తయారీ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.
ప్రస్తుతం చేయూత లబ్ధిదారులు : 1,23,041
వృద్ధాప్య పింఛన్‌దారులు : 48,918
వితంతు : 34,229
దివ్యాంగులు : 20,702
గీతకార్మికులు : 3,767
చేనేత కార్మికులు : 2,817
ఒంటరి మహిళలు : 3,271
బీడీ కార్మికులు : 9,937


