ఒకేరోజు ముగ్గురి సమీక్షలు..
యూసీఎఫ్.. క్రెడిట్ ఫైట్!
ఒకే రోజు ‘బండి’, ‘పొన్నం’,‘గంగుల’ సమీక్షలు
అన్ని సమీక్షలకూ బల్దియా కమిషనర్, అధికారులు
ప్రతిపాదనలపై మూడు పార్టీల పట్టు?
కరీంనగర్ కార్పొరేషన్: అభివృద్ధిలో కరీంనగర్ సిటీ స్వరూపాన్ని మార్చేసే అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) పనులపై ‘తీన్’ మార్ మొదలైంది. స్మార్ట్‌సిటీ తర్వాత మళ్లీ ఆస్థాయిలో రూ.840 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల క్రెడిట్ ఫైట్ యూసీఎఫ్‌తో రాజుకుంటోంది. పనుల ప్రతిపాదనల దశలో ఉన్న యూసీఎఫ్‌పై పట్టుకోసం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ప్రయత్నిస్తుండడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఒకేరోజు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి,ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌లు వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారంటే మూడు పార్టీల పైట్ ఏస్థాయికి చేరుతుందో అర్థంచేసుకోవచ్చు.
క్రెడిట్ ఫైట్..
నగరానికి ప్రత్యేకంగా నిధులు వస్తేతప్ప అభివృద్ధి జరగదని భావిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ యూసీఎఫ్ పథకంలో కరీంనగర్ నగరపాలకసంస్థను చేర్చారు. పథకంలో చేరిన నగరపాలకసంస్థకు రూ.840 కోట్ల నిధులు రానున్నాయి. రూ.840 కోట్లలో 25 శాతం అంటే రూ.210 కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటా కాగా, మరో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా. మిగతా 50 శాతం బ్యాంక్‌రుణం. రూ.840 భారీ నిధులతో నగరం స్వరూపం మరింతగా మారనుంది. పైగా పనులు చేసేందుకు నిధులు లేవనుకుంటున్న తరుణంలో వచ్చిన ఈ భారీ నిధులతో దాదాపు ఐదు సంవత్సరాలు ఎక్కడో ఒక చోట నగరంలో పనులు కొనసాగుతూనే ఉండే పరిస్థితి. దీంతో యూసీఎఫ్ క్రెడిట్ తమదంటే తమదని బీజేపీ, కాంగ్రెస్‌లు మొదట్లోనే పోటీపడ్టాయి. స్కీంలో చేర్చడంతో పాటు రూ.210 కోట్లు చెల్లించడం, రుణం ఇప్పించడం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఇది తమ ఘనతే అని బీజేపీ చెబుతోంది. రూ.840 కోట్లలో నేరుగా రూ.210 కోట్లు ఇవ్వడంతో పాటు, రుణంగా తీసుకున్న రూ.420 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని, మొత్తంగా రూ.630 కోట్లు తామే భరిస్తున్నందున తమకే ఖ్యాతి అని కాంగ్రెస్ వాదిస్తోంది.
తారాస్థాయికి..
ఇప్పటివరకు యూసీఎఫ్ ఎవరి ఖాతాలో అనే విషయంపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పరస్పరం విమర్శలకే పరిమితం కాగా.. ఇప్పుడు ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యే ‘అధికారిక’ంగా రంగంలోకి దిగడం నగర రాజకీయాలను మలుపుతిప్పింది. క్షేత్రస్థాయిలో ప్రభావంచూపే యూసీఎఫ్ ప్రతిపాదనలపై పట్టుకోసం మూడు పార్టీల నేతలు సాగిస్తున్న ఈ ‘అధికారిక’ ఫైట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఒకే రోజు...ఒకే సబ్జెక్ట్....ఒకే సందర్భం....లక్ష్యమూ ఒక్కటే...కానీ మూడు వేర్వేరు సమీక్షలు. ఈ నెల 19వ తేదీన నగరంలో నిర్వహించిన ఈ మూడు సమీక్షలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. కేంద్రంలోని అధికార బీజేపీ తరపున స్థానిక ఎంపీ హోదాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ తరఫున స్థానిక మంత్రిగా పొన్నం ప్రభాకర్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యే హోదాలో గంగుల కమలాకర్‌లు వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించడంతో ఒక్కసారిగా నగర రాజకీయంలో కదలికవచ్చింది. 19వ తేదీన ముందుగా ఆర్ అండ్ బీ అతిథిగృహంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్‌తో కలిసి యూసీఎఫ్‌పై సమీక్ష నిర్వహించారు. అధికారుల యూసీఎఫ్ ప్రతిపాదనలకు ఒకే చెప్పిన ఆయన అక్కడి నుంచే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్, సీడీఎంఏలతో ఫోన్‌లో మాట్లాడి త్వరగా ప్రతిపాదనలు ఆమోదించాలని కోరారు. ఆ వెంటనే కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. అన్ని డివిజన్‌లకు సమానంగా యూసీఎఫ్ నిధులు కేటాయించేలా ప్రతిపాదనలు రూపొందించాలని, రాజకీయాలకు తావివ్వరాదని ఆదేశించారు. అదేరోజు రాత్రి కరీంనగర్‌కు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ యూసీఎఫ్ ప్రతిపాదనలపై సమీక్షించారు. పనులు, నిధుల కేటాయింపుపై అధికారులకు పలు సూచనలుచేశారు. ఈ మూడు సమీక్షలకు నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఇంజినీరింగ్ అధికారులకు హాజరై తాము రూపొందించిన ప్రతిపాదనలు వివరించడంతో, ముగ్గురి సూచనలు ‘నోట్’ చేసుకున్నారు.


