కరీంనగర్‌అర్బన్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి మొదటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ చాంబర్‌లో గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గుడిసెల్లో నివసిస్తున్న 407 మందికి ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. వారికి వెంటనే ప్రొసీడింగ్‌లు అందించి, నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపికలో మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, గృహ నిర్మాణ శాఖ పీడీ గంగారాం, ఎంపీడీవోలు, గృహనిర్మాణ శాఖ డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.


