సొంత మరమ్మతు.. ప్రాణాలకు ముప్పు | - | Sakshi
Sakshi News home page

సొంత మరమ్మతు.. ప్రాణాలకు ముప్పు

Aug 16 2026 11:35 PM | Updated on Aug 16 2026 11:35 PM

● వర్షాల వేళ కరెంట్‌తో పొంచి ఉన్న ప్రమాదాలు

● జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు

‘ఈ ఫొటోలో విద్యుత్‌ షాక్‌తో మృతిచెందిన వ్యక్తి దర్ర రాజన్న. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శంకరావుపేట. గత జూలైలో తన పొలంలో వ్యవసాయ పనులు మొదలుపెట్టాడు. విద్యుత్‌ మోటార్‌ సరి చేస్తున్న క్రమంలో కరెంట్‌ షాక్‌తో మృతిచెందగా, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు’.

‘గతేడాది జూన్‌లో కోరుట్ల మండలం మోహన్‌రావుపేటకు చెందిన జూనియర్‌ లైన్‌మెన్‌ దుంపేట రాజేశం (40) వాల్గొండలో ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద విద్యుత్‌ తీగలను సరిచేసేందుకు స్తంభంపైకి ఎక్కాడు. అకస్మాత్తుగా విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌కు గురై మృతిచెందాడు’.

‘2025 అక్టోబర్‌లో ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామంలో అడవిపందుల నుంచి పంటలు కాపాడుకునేందుకు పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగలు తగిలి షాక్‌తో వ్యవసాయ కూలీ ప్రాణాలు కోల్పోయాడు’.

‘గతేడాది ఆగస్ట్‌లో సారంగాపూర్‌ మండలం పెంబట్లలో డిష్‌ తీగలు సరిచేస్తుండగా విద్యుత్‌ షాక్‌తో పల్లికొండ మహేశ్‌ మృతి చెందాడు’.

గొల్లపల్లి: ‘వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్‌ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వినియోగదారులు, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతంగా మరమ్మతు చేయవద్దు’ అని విద్యుత్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈదురుగాలుల వల్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగడం, పొలాల చుట్టూ వేలాడే తీగలు, తడిసిన విద్యుత్‌ పరికరాల వల్ల ప్రమాదాలు జరుగుతాయి. విద్యుత్‌ వినియోగంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలకే ప్రమాదమని, రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌తో నష్టం వాటిల్లితే సంబంధిత సంస్థల ద్వారా లభించే పరిహారం వివరాలు..

● మనుషులు మరణిస్తే: రూ.8 లక్షలు

● ఆవులు, గేదెలు మృతిచెందితే: రూ.45 వేలు (ప్రతి దానికి)

● మేకలు, గొర్రెలు మృతిచెందితే: రూ.5 వేలు (ప్రతి దానికి)

గమనిక: పరిహారం పొందడానికి ప్రమాదానికి సంబంధించిన పోలీసు ఫిర్యాదు, పోస్టుమార్టం రిపోర్టును సంబంధిత అధికారులకు సమర్పించాలి.

పరిహారం దక్కే సందర్భాలు

● అకస్మాత్తుగా విద్యుత్‌ తీగలు తెగిపడి మనుషులు లేదా పశువులు మరణించినప్పుడు

● లో వోల్టేజ్‌ సమస్యలు లేదా ట్రాన్స్‌ఫార్మర్‌ లోపాల వల్ల విద్యుత్‌ ప్రసారమై మృతిచెందినప్పుడు

● తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్‌ వైర్లు తెగిపడి ప్రమాదం జరిగినప్పుడు

రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు

రక్షణ వేదిక: మోటార్లను నేరుగా నేలపై ఉంచకుండా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిమెంట్‌/కాంక్రీట్‌ గట్లపై అమర్చుకోవాలి.

స్టార్టర్‌ బోర్డులు: వర్షపు నీరు తగలకుండా స్టార్టర్‌ బోర్డులకు తగిన రక్షణ (షెడ్‌) కల్పించాలి.

నిపుణుల సేవలు: మోటార్లు పనిచేయకపోయినా లేదా ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సమస్యలున్నా సొంతంగా బాగు చేయకుండా, తక్షణమే అర్హులైన టెక్నీషియన్లను లేదా లైన్‌మెన్లను పిలిపించాలి.

వైరింగ్‌ తనిఖీ: పొలాల్లో విద్యుత్‌ తీగలు, వైరింగ్‌ లైన్లను నిత్యం తనిఖీ చేస్తూ ప్లాస్టరింగ్‌/ఇన్సులేషన్‌ చర్యలు తీసుకోవాలి.

సొంత వైరింగ్‌ వద్దు: తెగిపడిన వైర్లను పొలాల చుట్టూ రైతులు సొంతంగా అమర్చుకోకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement