స్మార్ట్‌రేషన్‌ కార్డులొచ్చాయ్‌ | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌రేషన్‌ కార్డులొచ్చాయ్‌

Aug 15 2026 12:28 AM | Updated on Aug 15 2026 12:28 AM

మండలాల వారీగా వచ్చిన కార్డులు

నేడు లాంఛనంగా మండలానికి 10కార్డులు పంపిణీ

జిల్లాకు చేరిన 3.21లక్షల కార్డులు

పరేడ్‌ మైదానంలో మంత్రి అడ్లూరి చేతుల మీదుగా అందజేత

కరీంనగర్‌ అర్బన్‌: స్మార్ట్‌ రేషన్‌ కార్డులు జిల్లాకు చేరాయి. ఽఆధునిక సాంకేతికతతో ముద్రించగా శాశ్వత కార్డులుగా మిగిలిపోనున్నాయి. కుటుంబ మహిళా పేరుతో కార్డును ముద్రించారు. జిల్లాకు సంబంధించిన రేషన్‌ కార్డులు శుక్రవారం కలెక్టరేట్‌కు చేరుకోగా జిల్లా పౌరసరఫరాల అధికారి గట్టు నర్సింగరావు అధికారులతో సన్నాహాక సమావేఽశం నిర్వహించారు. సివిల్‌ సప్లయ్‌ నాయబ్‌ తహసీల్దార్లు పెద్ది విజయ్‌, ఆకారపు ఉషా, అన్నాడి శ్రీనివాస్‌రెడ్డి కార్డులను మండలాల వారీగా వేర్వేరుగా విభజించి రవాణాకు ఏర్పాట్లు చేస్తున్నారు. శని వారం స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పరేడ్‌ మైదానంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ కార్డులు పంపిణీ చేయనున్నారు.

మండలానికి 10కార్డులు పంపిణీ

పరేడ్‌ మైదానంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ కార్డులు పంపిణీ చేయనుండగా, ప్రతి మండలంలో 10కార్డులు అందించనున్నారు. ఆయా మండలాల తహసీల్దార్లు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక వచ్చిన కార్డుల బాక్స్‌లను మండలాల వారీగా తహసీల్దార్లకు అప్పగించనుండగా తదుపరి అక్కడి నుంచి గ్రామాలు, పట్టణాల వారీగా రేషన్‌ డీలర్లకు కార్డులు చేరనున్నాయి. జీపీవోలు, వార్డు అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో కార్డులు పంపిణీ చేయనున్నారు.

అధునాతన తరహాలో కార్డు

రహస్య భద్రతా గుర్తులు, స్పర్శ ద్వారా గుర్తించే సాంకేతికత, డిజిటల్‌ ధ్రువీకరణ వంటి పద్ధతులను కార్డులో వినియోగించారు. కార్డుపై తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో కూడిన హోలోగ్రామ్‌ను ముద్రించారు. కార్డు ప్రామాణికతను నిర్ధారించడం, నకిలీ కార్డుల తయారీని అడ్డుకోవడం, ప్రజా పంపిణీ వ్యవస్థలో లబ్ధిదారుల గుర్తింపును బలోపేతం చేయడం కార్డు లక్ష్యం. అలాగే కార్డులో మైక్రో ప్రింటెడ్‌ టెక్సట్‌ను ఉపయోగించారు. అతి చిన్న పరిమాణంలో ఉండే ఈ అక్షరాలు సాధారణంగా కంటికి స్పష్టంగా కనిపించవు. సాధారణ ప్రింటర్లతో నకిలీ చేయడం కష్టంగా ఉండటంతో ఇది యాంటీ కాపీ భద్రతా అంశంగా పనిచేస్తుంది. ‘గవర్న మెంట్‌ ఆఫ్‌ తెలంగాణ’, ‘ఒరిజినల్‌’ వంటి అక్షరాలతో ద్వంద్వ రహస్య చిత్రాలను పొందుపరిచారు. కార్డు అసలైనదో కాదో నిర్ధారించేందుకు నిపుణులకు ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. తెలంగాణ ప్రభుత్వ చిహ్నాన్ని అతినీలలోహిత కాంతిలో కనిపించేలా ప్రత్యేక సిరాతో ముద్రించారు. అధీకృత సాఫ్ట్‌వేర్‌ లేదా స్కానింగ్‌ వ్యవస్థల ద్వారా మాత్రమే ఇందులోని సమాచారాన్ని ధ్రువీకరించేలా రూపొందించారు.

స్మార్ట్‌ రేషన్‌కార్డు

కార్డులపై చర్చిస్తున్న డీఎస్వో నర్సింగరావు

మండలం కార్డులు

కరీంనగర్‌ అర్బన్‌ 63,475

హుజూరాబాద్‌ 24,165

జమ్మికుంట 24,061

చొప్పదండి 17,775

మానకొండూరు 23,863

కరీంనగర్‌ రూరల్‌ 18,036

గంగాధర 17,673

రామడుగు 17,003

వీణవంక 16,944

ఇల్లందకుంట 11,246

శంకరపట్నం 15,785

తిమ్మాపూర్‌ 16,551

కొత్తపల్లి 18,565

సైదాపూర్‌ 14,275

చిగురుమామిడి 14,507

గన్నేరువరం 7,290

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement