కరీంనగర్‌క్రైం: పోలీసుశాఖలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తూ, కీలక కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీ (పరిపాలన) పి.వెంకటరమణకు రాష్ట్రపతి పోలీసు పతకం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీసు సేవా పతకాల్లో భాగంగా ఈ గౌరవం దక్కింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పి.వెంకటరమణ 1991 జూలై 15న ఎస్‌ఐగా పోలీసుశాఖలో చేరారు. మాండ్రక్స్ మాదకద్రవ్యాల కేసు, అక్రమ ఆయుధాల స్వాధీనం, బిహార్‌కు చెందిన నేర ముఠాల కేసులు, నకిలీ స్టాంపుల కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించారు. పోలీసుసేవా పతకం, ఉత్తమ సేవా పతకం, కేంద్ర హోం మంత్రిత్వశాఖ దర్యాప్తులో అత్యుత్తమ ప్రతిభకు ఇచ్చే పతకం అందుకున్నారు. 2025 మే 22న అడిషనల్ డీసీపీగా పదోన్నతి పొంది జూన్ 2నుంచి కరీంనగర్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మూడు దశాబ్దాలకు పైగా నిబద్ధతతో సేవలందించినందుకు రాష్ట్రపతి పోలీసు పతకానికి ఎంపికయ్యారు. సీపీ గౌస్ ఆలం, అధికారులు అభినందించారు.
లీడింగ్ ఫైర్ ఫైటర్ నరసింహాచారికి..
కరీంనగర్‌క్రైం: అగ్నిమాపకశాఖలో 33ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న మానకొండూరుకు చెందిన లీడింగ్ ఫైర్ ఫైటర్ టి.నరసింహచారి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. 1993 బ్యాచ్‌కు చెందిన నరసింహచారి తన సుదీర్ఘ సర్వీసులో అనేక అగ్ని ప్రమాదాలు, రక్షణ చర్యలు, అత్యవసర ఘటనల్లో సేవలందించారు. మూడు దశాబ్దాల్లో ఎలాంటి ప్రతికూల రిమార్క్ లేకుండా విధులు నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు, ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని రక్షించడం, అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టడం వంటి కీలక ఘటనల్లో చురుగ్గా పాల్గొన్నారు.
ఆర్వోబీతో ప్రజలకు ఇబ్బంది కాకుండా చర్యలు
కరీంనగర్: ఆర్‌వోబీ పను ల జాప్యంతో జరుగుతు న్న ఇబ్బందులను తొలగించేందుకు కొత్త డైవర్షన్ రోడ్డు కోసం ఎస్ ఎస్‌ఆర్ రేట్లను సవరించి టెండర్ పిలిచినట్లు మే యర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ‘సాక్షి’లో ‘డైవర్షన్ టెండర్’ శీర్షికన ప్రచురితమైన కథనానికి మే యర్ స్పందించారు. ఎస్‌ఎస్ ఆర్ రేట్లు పెరగడంతో పాత రేట్ల ప్రకారం పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదన్నారు. గతంలో చేసిన తీర్మానాన్నే కొనసాగిస్తూ, ప్రస్తుతం అమల్లో ఉన్న ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం టెండర్ పిలిచినట్లు వివరించారు.ఆర్‌వోబీ డైవర్షన్ రోడ్డు నిర్మాణం మున్సిపల్ పరిధిలో చేపట్టాల్సిన పని కాదని, రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు ఆర్‌అండ్‌బీశాఖ వద్ద లేవని, పనిని మున్సిపల్ ద్వారా చేపట్టాలని కోరుతూ ఆశాఖ నుంచి లేఖ అందిందన్నారు. దాని ఆధారంగా రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు మున్సిపల్ ముందుకు వచ్చిందని స్పష్టం చేశారు. ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు పెరిగిన నేపథ్యంలో పాత ధరలకు టెండర్ ఖరారు చేయడం సాధ్యం కాదని, ప్రస్తుత రేట్ల ప్రకారం ప్రక్రియ చేపట్టామని వివరించారు.


