● ఇద్దరికి గాయాలు
హుజూరాబాద్: కారు.. వాటర్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని లక్ష్మీనగర్‌కు చెందిన దర్శనాల శేఖర్(43) మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా కారులో ఆర్.శ్రీధర్, అజీమొద్దీన్‌తో కలిసి హుజూరాబాద్ వచ్చారు. శుక్రవారం రాత్రి కరీంనగర్ వెళ్తుండగా తుమ్మనపల్లి శివారులో ప్రధాన రహదారిపై వాటర్ ట్యాంకర్ ఢీకొంది. శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్.శ్రీధర్, అజీమొద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
వృద్ధురాలి ఆత్మహత్య
కోరుట్లరూరల్: మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన కస్తూరి వెంకమ్మ (81) మతి స్థిమితం సరిగా లేక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. వెంకమ్మ కాలుకు ఏడాది క్రితం శస్త్రచికిత్స చేయించారు. కాలు నొప్పి కారణంగా ఆరునెలల నుంచి రెండుసార్లు కిందపడడంతో మెదడులోని నరాలు దెబ్బతిని మతిస్థిమితం కోల్పోయింది. గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయి గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కూతురు బోదాసు లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


