సిరిసిల్లటౌన్: యజమానే యముడయ్యాడు. తరుచూ పని మానేస్తుంటే తొలగిస్తామని చెప్తే మృతుడి భార్య వచ్చి గొడవ చేస్తుండడంంతో వర్కర్‌పై కక్షపెంచుకున్నాడు. హత్య చేస్తే కేసు మున్సిపల్ వైస్‌చైర్మన్‌పైకి పోతుందని భావించి మద్యంలో రసాయనం కలిపి అంతమొందించాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో మిస్టరీగా ఉంటున్న వైపని కార్మికుడు వెంగల వెంకటేశం మృతిలో కీలక నిందితుడిని సిరిసిల్ల డీఎస్పీ కత్తురోజు నాగేంద్రచారి అరెస్ట్ చేశారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని తారకరామానగర్‌కు చెందిన వెంగల వెంకటేశం(50) బి.వై.నగర్‌కు చెందిన కుసుమ గణేశ్ వద్ద వైపని కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వెంకటేశం తరచూ పనికి రాకుండా ఉండడం, పని మధ్యలో చెప్పకుండా వెళ్లిపోయేవాడు. ఇలాంటి సమయంలో పనిలోంచి తొలగిస్తానని గణేష్ హెచ్చరించినప్పుడల్లా వెంకటేశం భార్య వచ్చి గొడవకు దిగేది. ఈనేపథ్యంలో వెంకటేశంపై గణేశ్ కక్ష పెంచుకున్నాడు. ఇటీవల సిరిసిల్ల మున్సిపల్ వైస్‌చైర్మన్ దార్ల సందీప్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు రూ.లక్ష డిమాండ్ చేశారన్న ఆరోపణలు వెంకటేశం, అతని భార్య సులోచన చేయగా కేసు నమోదైంది. వెంకటేశంను హత్య చేస్తే, నేరం దార్ల సందీప్‌పైకి పోతుందని గణేష్ భావించాడు. పైగా మున్సిపల్ ఎన్నికల్లో దార్ల సందీప్‌కు పోటీగా బరిలో నిలిచి ఓడిపోయిన మార్గం లక్ష్మణ్‌తో గణేశ్ స్నేహం ఉంది. సందీప్ పదవి కోల్పోతే లక్ష్మణ్‌కు ఎవరూ పోటీ ఉండరని, వెంకటేశంతో తనకున్న సమస్య తీరుతుందని భావించాడు. ఈనేపథ్యంలో ఈనెల 6న గణేశ్, వెంకటేశంను మద్యం తాగడానికి రగుడు సమీపంలోని గుట్టకు తీసుకెళ్లాడు. అప్పటికే మద్యం కొని వెంకటేశం తాగే మద్యంసీసాలో నైట్రాప్(డైయింగ్ రసాయనం)కలిపి ఉంచాడు. దానిని వెంకటేశంతో తాగించి ఏమి ఎరుగనట్లు ఇంటికొచ్చేశాడు.
పట్టిచ్చిన సూసైడ్‌నోట్
మృతుడి భార్య సులోచన ఫిర్యాదుతో ఈనెల 6న సిరిసిల్ల ఠాణాలో మిస్సింగ్ కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలు పరీక్షించారు. మృతుడు, నిందితుడు ఇద్దరు కలిసి వెళ్లడాన్ని గమనించి విచారణ చేపట్టారు. గణేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. వెంకటేశంను నైట్రాప్ తాగించి చంపినాక అతని జేబులో గణేశ్ సూసైడ్‌నోట్‌ను ఉంచాడు. అస్సలు రాయడం రాని వెంకటేశం సూసైడ్‌నోట్ ఎలా రాస్తాడని పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని పట్టుకున్నారు. ఈ సంఘటనలో అధికార పార్టీ నేత మార్గం లక్ష్మణ్, పోసు రమేశ్, పసునూరి సూర్యప్రకాశ్‌తోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని హత్యకేసులో వారి ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై నాగరాజు, క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ పుల్కం శ్రీనివాస్, కానిస్టేబుళ్లు బి.రవి, ఎన్.శ్రీనివాస్‌లను అభినందించారు.
మద్యంలో నైట్రాప్ తాగించిన గణేశ్
మరో నలుగురిపై సాగుతున్న దర్యాప్తు
హత్య కేసులో నిందితుడు రిమాండ్
వివరాలు వెల్లడించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి


