ఆన్‌లైన్‌లోనే ఎరువులు | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లోనే ఎరువులు

Aug 5 2026 1:47 AM | Updated on Aug 5 2026 1:47 AM

కరీంనగర్‌ అర్బన్‌: ఎరువుల అక్రమాలకు చెక్‌ పెడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతికతను వినియోగిస్తున్నాయి. రైతులు కాకుండా పరిశ్రమలు, ఇతరత్రా వ్యాపారాలకు ఎరువులు తరలుతుండగా ఎమ్మార్పీకి మించి విక్రయించడం, పాత వాటికి కొత్త ధరలను అమలు చేస్తూ అన్నదాతను దోచుకుంటున్న ఘటనలు కోకొల్లలు. ఇప్పటికే యూరియా కోసం యాప్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎరువులన్నింటికి కలిపి ఒకే యాప్‌ను ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ ఫర్టిలైజర్‌ సేల్‌(ఎఫ్‌ఎఫ్‌పీ) రూపొందించారు. సాగుకు మాత్రమే వినియోగించేలా యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్‌ మొదటి వారంలో యాప్‌ అందుబాటులోకి రానుండగా ఇప్పటికే వ్యవసాయ అధికారులకు శిక్షణనిచ్చారు. ఫర్టిలైజర్‌ దుకాణదారులకు శిక్షణనివ్వనుండగా వీలైనంత వరకు సదరు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఆధార్‌/బయోమెట్రిక్‌తో యూరియా పంపిణీ చేస్తుండగా యాప్‌ అందుబాటులోకి రాగానే స్లాట్‌ విధానంలో ఎరువులు ఇవ్వనున్నారు.

యాప్‌ ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

అండ్రాయిడ్‌ ఫోన్‌లో ప్లే స్టోర్‌లో ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ ఫర్టిలైజర్‌ సేల్‌ అని టైప్‌ చేసి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. తరువాత రాష్ట్రాన్ని ఎంచుకోని ఆధార్‌ సంఖ్యను నమోదు చేయాలి. తదనంతరం ఓటీపీ ప్రెస్‌ చేయాలి. ఆధార్‌ లింకు లేని రైతులు ఫేస్‌ అథెంటికేషన్‌ ద్వారా లాగిన్‌ కావాలి. అపుడు రైతు పేరు మీద ఎంత భూమి ఉందో సర్వే నంబర్‌ వారీగా చూపిస్తుంది. అనంతరం పండించే పంటను ఎంపిక చేసుకోవాలి. పంట వర్గంలో సైరెల్స్‌ ఎంపిక చేస్తే పంటలు కనిపిస్తాయి. ఏ పంటనో ఎంపిక చేసుకోని పండించబోయే పంట అని ఉన్న చోట ప్రెస్‌ చేయాలి. తరువాత భూమిని ఎంచుకుని సర్వే నంబర్‌ సెలెక్ట్‌ చేస్తే ఏ ఎరువు ఎంత వస్తుందో చూపిస్తుంది. అప్పుడు అవును అని ఉన్న చోట ప్రెస్‌ చేయాలి. అప్పుడు ఎరువుల బస్తాలు ఎన్ని అవసరమో గరిష్టంగా సెలెక్ట్‌ చేసుకుని ఎక్కడ ఎరువులు అందుబాటులో ఉన్నాయో షాపుల వారీగా చూసుకుని ఎంపిక చేసుకోవాలి. బుక్‌ చేసుకున్న రోజు ఎరువులు ఇవ్వరు. తరువాత రెండు రోజులు మాత్రమే ఎరువులు ఇస్తారు. క్యూఆర్‌ కోడ్‌ చూపిస్తేనే ఫర్టిలైజర్‌ షాప్‌ నిర్వాహకులు ఈ–పొస్‌ మిషన్‌ ద్వారా స్కాన్‌ చేసుకుని ఇస్తారు.

హెక్టారు వరకు ఏక మొత్తంలో ఎరువులు

ప్రస్తుతం వరకు ఉన్న యాప్‌లో రైతులు ఒకేసారి కాకుండా విడతలవారీగా బుక్‌ చేసుకోవాల్సి ఉండేది. అయిదెకరాల్లో భూమి ఉన్న రైతులు రెండు విడతల్లో, 5నుంచి 20 ఎకరాల భూమి ఉన్న రైతులు మూడు విడతల్లో, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం భూమి ఉన్న రైతులు నాలుగు విడతల్లో ఎరువులు తీసుకెళ్లాల్సి ఉండేది. తాజా యాప్‌లో ఒక హెక్టారు అంటే రెండున్నర ఎకరాల వరకు పూర్తిస్థాయిలో ఎరువులు తీసుకోవచ్చు. అంతకుమించి భూమి ఉన్న రైతులు హెక్టారు లెక్కన ఎరువులు తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఆధార్‌తో పంపిణీ

కేంద్ర ప్రభుత్వం మొబైల్‌ ఫర్టిలైజర్‌ మేనేజ్మెంట్‌ సిస్టమ్‌ (ఎంఎఫ్‌ఎంఎస్‌) ప్రవేశపెట్టి వ్యాపారులతో పాటు సంఘాలకు పాయింట్‌ ఆఫ్‌ సేల్‌(పీఓఎస్‌) మిషన్లు సరఫరా చేసింది. ఇందులో ఆధార్‌ నంబర్‌ నమోదు చేసి రైతుల వేలిముద్రలు తీసుకొని ఎరువులు విక్రయిస్తున్నారు. దీంతో ఆధార్‌ కార్డు ద్వారా ఎన్ని బస్తాలు తీసుకున్నారో పీఓఎస్‌ మిషన్లలో తెలుస్తుంది. దీంతో అధికంగా తీసుకుని నిల్వ చేసుకునే వీలుండదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ వేరేవారి ఆధార్‌ తీసుకువస్తే సంబంధిత రైతు చరవాణికి వచ్చిన ఓటీపీ నమోదు చేయాలి.

వచ్చే నెల నుంచి అమలు

యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులు బుక్‌ చేయాల్సిందే

ఎఫ్‌ఎఫ్‌పీ యాప్‌లో హెక్టార్‌కు బస్తాలు

అక్రమాలకు ముకుతాడు పడేనా.?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement