జిల్లాలో..
కరీంనగర్‌అర్బన్: చౌక ధరల దుకాణాలను మరింత పారదర్శకంగా మలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే వన్ నేషన్.. వన్ రేషన్‌తో కేంద్రం పంపిణీలో కొత్త ఒరవడిని సృష్టించగా తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కట్టుదిట్టం చేశాయి. బోగస్ కార్డుల ఏరివేతతో పాటు వలసలు, మరణించినవారి వివరాలు తొలగించేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఈకేవైసీ తప్పనిసరి చేసిందని తెలుస్తోంది. స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించగా ఇక వచ్చే నెలలో మూడునెలల బియ్యం ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తంగా స్మార్ట్ కార్డులు, ఈకేవైసీ మరింత పారదర్శకతకు వేదికవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నెల వరకు గడువు
రేషన్‌కార్డులో ఉన్న ప్రతి వ్యక్తి ఈకేవైసీ చేసుకోవాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయగా బోగస్ కార్డులతో పాటు యూనిట్లు కనుమరుగవనున్నాయి. రెండేళ్లుగా ఈకేవైసీ(ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియ సాగుతోంది. రేషన్ తీసుకునేవారికి కేవైసీ తప్పనిసరి ఉంటుండగా మిగతా సభ్యుల వివరాలు కేవైసీ చేసుకోవడం లేదు. దీంతో అసలు వారున్నారా, ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారా, మరణించారా..నన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 7.20లక్షల మంది కేవైసీ చేసుకోగా 2.25లక్షల మంది దూరంగా ఉన్నారు. కాగా మీ సేవ కేంద్రాలు లేదా రేషన్ దుకాణాల్లో ఈ నెల 31లోగా కేవైసీ చేసుకోవడం అత్యవసరం. లేకుంటే భవిష్యత్‌లో వారి పేర్లను తొలగించే అవకాశాలున్నాయి. కార్డులో ఉన్నవారు ఫిజికల్‌గా వేలిముద్ర వేయడమే కేవైసీ ప్రక్రియ. చాలామంది ఇతర దేశాలు, రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. కరీంనగర్ అర్బన్, కొత్తపల్లి, హుజూరాబాద్, జమ్మికుంట, తిమ్మాపూర్ మండలాలు కేవైసీలో చాలా వెనుకంజలో ఉన్నాయి.
త్వరలో స్మార్ట్ కార్డు
రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రింట్ పేపర్లు కాకుండా ఓటరు కార్డు తరహాలో రేషన్ స్మార్ట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించగా త్వరలోనే సదరు కార్డులు జిల్లాకు రానున్నాయి. కార్డుపై క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు, సంబంధిత రేషన్ దుకాణం, కార్డు స్థితి వంటి సమాచారం తెలిసిపోతుంది. ప్రత్యేక భద్రతా ప్రమాణాలతో రూపొందిస్తుండగా భవిష్యత్‌లో సంక్షేమ పథకాలకు అనుసంధానం చేయనున్నారు.
గ్రామ పంచాయతీలు: 318
మునిసిపాలిటీలు: 04
రేషన్ దుకాణాలు: 566
రేషన్ కార్డులు: 3,17,748
యూనిట్లు: 9,45,665
ఈకేవైసీ చేసుకున్నవారు: 7,20,517
ప్రతినెలా పంపిణీ చేసే బియ్యం:
5,502.936 మెట్రిక్ టన్నులు


