జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట సప్తగిరి మిల్లులో సోమవారం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి బస్వారెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మిల్లులులో నిల్వ ఉంచిన ధాన్యం, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా మిల్లులో ప్రభుత్వం అప్పగించిన ధాన్యం, నిల్వ ఉంచిన ధాన్యానికి 2,163 మెట్రిక్ టన్నులు తేడా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా 2022–23 సంవత్సరంలో మరాడించి ఇవ్వాల్సిన బియ్యం నిల్వలకు సంబంధించి బకాయిలు రూ.4.83 కోట్లు ప్రభుత్వ గడువు ఆగస్టు 10లోపు చెల్లించాలని హామీ పత్రాన్ని రాయించుకోగా, ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. డీఎస్పీ సీతారెడ్డి, తహసీల్దార్ దినేశ్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు అనిల్, ప్రశాంత్, డీఈ విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
దేశంలో నియంతృత్వ పాలన
కరీంనగర్‌టౌన్: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశ రాజధానిలో తీవ్ర ఆందోళన జరుగుతున్నా బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తోందని సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సోమవారం నిర్వహించిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారన్నారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అత్యంత అవినీతి పరులకు, అక్రమార్కులకు అండగా నిలుస్తూ.. వారిని అక్కున చేర్చుకోవడం హేయమైన చర్య అని విమర్శించారు. కార్యవర్గ సభ్యుడు పిట్టల సమ్మయ్య, నాయకులు పంజాల శ్రీనివాస్, పొనగంటి కేదారి, కొయ్యడ సృజన్‌కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, బత్తుల బాబు, టేకుమల్ల సమ్మయ్య, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, న్యాలపట్ల రాజు పాల్గొన్నారు.
‘ఎల్‌నినో’ అధికారిగా మహేశ్‌దత్ ఎక్కా
కరీంనగర్ అర్బన్: ఎల్‌నినో ప్రభావం నిలువరింత, ప్రతికూల పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఉమ్మడి జిల్లావారీగా సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు బెన్‌హర్ మహేశ్‌దత్ ఎక్కా వ్యవహరించనున్నారు. వర్షపాతం, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భజలాలు, తాగునీటి లభ్యత, వ్యవసాయ–ఉద్యాన పంటల పరిస్థితి, విద్యుత్ సరఫరా వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించనున్నారు.


