ప్రభుత్వం చొరవ తీసుకోవాలి
తక్షణమే నియమించాలి
16 మండలాలకు ఎంఈవోలు ఇన్‌చార్జీలే
హెచ్‌ఎంలకు అదనపు బాధ్యతలతో సతమతం
గాడి తప్పుతున్న పర్యవేక్షణ
కరీంనగర్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. జిల్లాలో 16 మండలాల్లో రెగ్యులర్ మండల విద్యాధికారులు లేక విద్యాశాఖ ఇన్‌చార్జీల పాలనకే పరిమితమైంది. ప్రధానోపాధ్యాయులే అదనపు బాధ్యతలతో ఇన్‌చార్జీ ఎంఈవోలుగా వ్యవహరిస్తుండగా, పాఠశాల నిర్వహణ, మండల విద్యా వ్యవహారాల బాధ్యతలతో సతమతమవుతున్నారు. ఖాళీ పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతో విద్యావ్యవస్థ గాడి తప్పుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎంఈవోలకు తప్పని తిప్పలు
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరు, మధ్యాహ్న భోజన అమలు, సమగ్రశిక్ష చేపట్టే విద్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంలో ఎంఈవోల పాత్ర కీలకం. ఏళ్ల తరబడి రెగ్యులర్ ఎంఈవోలు లేక ఖాళీగా ఉన్న వీరి స్థానాల్లో సీనియర్ హెచ్‌ఎంలను ఇన్‌చార్జీలుగా నియమిస్తున్నారు. అదనపు బాధ్యతలతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నామని పలువురు ఇన్‌చార్జీ ఎంఈవోలు చెబుతున్నారు. పర్యవేక్షణ కరువై పాఠశాలల్లో ఉపాధ్యాయులు సైతం సమయపాలన పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఉప విద్యాధికారులు ఇన్‌చార్జీలే..
జిల్లాలో విద్యావ్యవస్థపై ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ పాఠశాలల నిర్వహణ, మధ్యాహ్న భోజనం ఇతర కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పరిశీలించి జిల్లా విద్యాధికారికి నివేదిక ఇవ్వాల్సిన ఉప విద్యాధికారులు సైతం అందరూ ఇన్‌చార్జీలే. హుజురాబాద్, కరీంనగర్, జిల్లా పరిషత్ డిప్యూటీ ఈవోలుగా రెగ్యులర్ అధికారులు లేక ఇన్‌చార్జీల పాలనే కొనసాగుతోంది.
పనులపై పర్యవేక్షణ ఎలా..
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో జరిగే తప్పిదా ల విషయంలో పర్యవేక్షణ చేపట్టాలి. ప్రస్తుతం ఇన్‌చార్జీ ఎంఈవోలతో ఇవేమి సక్రమంగా నడువని ప రిస్థితి నెలకొంది. పదో తరగతి, ఓపెన్ టెన్త్, ఇంట ర్ తదితర పరీక్షలను డిప్యూటీ ఈవో లేక డీఈవోనే నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. కాగా, రెగ్యులర్ ఎంఈవోలు లేక ఇన్‌చార్జీగా విధులు నిర్వహించేవారు శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేసే అవకాశాలు ఉంటాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు అత్యవసర పని నిమిత్తం ఎంఈవో కార్యాలయానికి వెళ్తే అక్కడ వారు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఒక్క ఎంఈవో అన్నీ తానై..
ప్రతీ మండల వనరుల కేంద్రంలో రెగ్యులర్ ఎంఈ వోతో పాటు సీనియర్ అసిస్టెంట్ ఒకరు, జూనియ ర్ అసిస్టెంట్ ఒకరు, అటెండర్, రాత్రి కాపలాదారు ఒకరు ఉండాలి. కానీ, ప్రస్తుతం కేవలం ఒక్క విద్యాధికారి మాత్రమే అన్నీ తానై పనులు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. శాశ్వత సిబ్బందిని నియమించకుండా, కాంట్రాక్టు సిబ్బందితోనే పనులు చేయించడం గమనార్హం. ప్రతి మండలంలో 40 నుంచి 100 పాఠశాలల పర్యవేక్షణ చేయాలి. 100 నుంచి 300 మంది ఉపాధ్యాయుల పనితీరు చూడాలి. రెగ్యులర్ ఎంఈవోలను నియమిస్తే ఖజానాపై భారం పడుతుందనే కారణంతో ప్రభుత్వం నియమించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎంఈవోల భర్తీ అంశాలను విద్యాశాఖ పట్టించుకోకపోవడం విచారకరం. ప్రభుత్వం వెంటనే ఎంఈవోల నియమాకాన్ని పూర్తి చేయాలి. విద్యావ్యవస్థను పట్టిష్టం చేసేందుకు భోదన, బోధనేతర, పర్యవేక్షణ సిబ్బందిని నియమించాలి. – అన్నమనేని తిరుపతిరావు,
తపస్ జిల్లా అధ్యక్షుడు
ఏళ్లు గడుస్తున్నా ఎంఈవో లను నియమించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను పర్యవేక్షించాల్సిన ఎంఈవోలు అదన పు బాధ్యతల వల్ల ఆ దిశగా వెళ్లడం లేదు. విద్యశాఖకు ప్రత్యేకంగా మంత్రిని నియమించాలి.
– మచ్చ రమేశ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి


