కరీంనగర్‌అర్బన్: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమాన్ని ఉద్యమంలా అమలు చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ జలసిరి పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు. వీబీజీరామ్‌జీ పథకం కింద గ్రామాల్లో ఇంకుడుగుంతలు, ఊట కుంటలు, పంట కుంటలు, బోరు బావుల రీచార్జ్ నిర్మాణాలు చేపట్టి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యానవన, భూగర్భ జలాలు, గనులు–భూగర్భ శాస్త్రం, మత్స్య, ప్రణాళిక, విద్యుత్ శాఖలతో పాటు స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణం) అధికారులు పరస్పర సహకారంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, అశ్విని తానాజీ వాకడే, డీఆర్డీవో గీతా, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


