కరీంనగర్ పీఎంజే కేసులో చోరీ బంగారం నేపాల్‌కు తరలింపు
దోపిడీకి ఉపయోగించిన యాప్ కార్యకలాపాలు నిలిపివేత
తిరిగి బిహార్ జైలుకు సుబోధ్ సింగ్
ఘటనను నూతన డీఎస్పీలకు రేపు పాఠంగా చెప్పనున్న సీపీ గౌస్ ఆలం
బెయిల్ కోసం మొదలైన ప్రయత్నాలు..
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●:
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసు దర్యాప్తులో కొత్త విషయం వెలుగుచూసింది. ఈ ఏడాది మే 3న జరిగిన దోపిడీలో సుబోధ్ సింగ్ ముఠా రూ.88లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఎలాంటి ఆధారాలు లేని కేసు దర్యాప్తు పోలీసులకు సవాలుగా మారింది. ఆధునిక సాంకేతికతతో బిహార్‌లోని జైలులో ఉన్న సుబోధ్ సింగ్, అతని అనుచరులు దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. ఇప్పటివరకు కేసులో సుబోధ్ సింగ్, రఽఘునాథ్ కర్మాకర్, రావిష్ కుమార్, జైనుల్లావుద్దీన్, అమర్‌సింగ్, మెహతాబ్‌ఖాన్, సూర్యమణి, ఆధిల్‌ఖాన్‌ను అరెస్టు చేసి కరీంనగర్ జైలులో ఉంచారు. దేశవ్యాప్తంగా 27 నేరారోపణల్లో నిందితుడిగా ఉన్న సుబోధ్‌సింగ్‌ను జూలై 2న బిహార్ హైకోర్టు ఆదేశాల మేరకు అక్కడి జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా తన అనుచరులకు ప్రత్యేకమైన యాప్ రూపొందించి నేరాలు చేసేందుకు ఆదేశాలు ఇస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు, ఆ యాప్‌ను పనిచేయకుండా నిలిపివేశారు. మే 3న కరీంనగర్‌లో దోపిడీ చేసిన ఆభరణాలను ధర్మపురి మీదుగా ఛత్తీస్‌ఘడ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని అసాన్‌సోల్ నగల వ్యాపారికి విక్రయించినట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి ఆరాతీయగా బంగారాన్ని బీహార్ సరిహద్దుల మీదుగా నేపాల్ తరలించారని తెలుసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
18న నూతన డీఎస్పీలకు పాఠంగా దోపిడీ కేసు
రాష్ట పోలీస్ దర్యాప్తు చరిత్రలో కఠినమైన కేసుల్లో ఒకటిగా పీఎంజే దోపిడీ కేసు రికార్డుకెక్కింది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి చేసిన దోపిడీని ఛేదించిన సందర్భాన్ని డిపార్ట్‌మెంట్‌లో చేరనున్న ప్రతీ పోలీస్ తెలుసుకోవాలని హోంశాఖ నిర్ణయించింది. ఇటీవల ఎంపికై న డీఎస్పీలకు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో ఈనెల 18న కరీంనగర్ సీపీ గౌస్ ఆలం పాఠంగా బోధించనున్నారు. ఘటనకు ముందు రెక్కీ, దోపిడీ చేసిన విధానం, ఆధారాలు లేకుండా పరారైన వైనం, ఒక్కొక్క పనికి ఒక్కో వరుసలో నేరస్తులను ఉపయోగించిన తీరు, ఎన్‌క్రిప్టెడ్ యాప్స్ ద్వారా దొంగలు సంప్రదింపులు జరిపిన విధానం, బిహార్ జైలులో ఉండి ఈ మొత్తం దోపిడీకి స్కెచ్ వేసిన సుబోధ్‌సింగ్‌ను కరీంనగర్‌కు తరలించే వరకు జరిగిన ఘటనలను ఫొటోలు, వీడియోల రూపంలో గౌస్ ఆలం స్వయంగా వివరించనున్నారు. ఇకపై డిపార్ట్‌మెంట్‌లోకి కొత్తగా వచ్చే కానిస్టేబుల్ దగ్గర నుంచి డీఎస్పీల వరకు పీఎంజే దోపిడీ కేసును కేస్ స్టడీగా బోధించాలని పోలీస్‌శాఖ నిర్ణయించనుంది.
పీఎంజే చోరీ కేసులో అరెస్టు అయి కరీంనగర్ జైలులో రిమాండ్‌లో ఉన్న రఽఘునాథ్ కర్మాకర్, రావిష్ కుమార్, జైనుల్లావుద్దీన్, అమర్‌సింగ్, మెహతాబ్‌ఖాన్, సూర్యమణి, ఆధిల్‌ఖాన్‌కు బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. తన గ్యాంగ్ చేసే నేరాల తరఫున వాదించేందుకు సుబోధ్ సింగ్ కొంతమంది లాయర్లను నియమించుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ లాయర్‌ను బెయిల్ ఇప్పించేందుకు ఏర్పాటు చేసుకున్నారు. రిమాండ్ ఖైదీలు ఉన్న నిందితులకు లాయరు ఇప్పటికే బెయిల్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.


