కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. చాలా స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య కన్నా ఉపాధ్యాయులు సంఖ్య ఎక్కువగా ఉంది. ఉన్న ఒకరిద్దరిని విద్యార్థులను సమీప పాఠశాలల్లో సర్దుబాటు చేయాల్సిన విద్యాశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. సమయానికి పాఠశాలకు వచ్చి, కాలక్షేపం చేసి వెళ్లడం ఉపాధ్యాయుల వంతవుతోంది. సర్కారు నుంచి రూ.వేలల్లో జీతాలు తీసుకుంటూ ఉపాధ్యాయులు ఖాళీగా ఉంటున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తుండగా.. విద్యార్థులు రాకపోవడంతో తమకూ బాధాకరంగా ఉందని, ప్రభుత్వ ఆదేశాలనుసారం పనిచేస్తామని ఆయా పాఠశాలల ప్రభుత్వ టీచర్లు చెబుతున్నారు.
శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు ఎనిమిది మంది ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. గురువారం ఒకే విద్యార్థి హాజరయ్యాడు. ఈ విద్యాసంవత్సరంలో 7,9,10 తరగతుల్లో విద్యార్థులు లేరు. 6వ తరగతిలో ఒకరు, 8వ తరగతిలో నలుగురు ఉన్నారు. గ్రామంలో 6వ తరగతి నుంచి 10వతరగతి వరకు చదివే 40మంది కేశవపట్నం, సైదాపూర్ మండలం సోమారం మోడల్‌స్కూల్, కేశవపట్నం కేజీబీవీలో, 25మంది ప్రైవేటు, గురుకులాల్లో చదువుతున్నారు. ఐదు రోజుల పాటు బడిబాట నిర్వహించినా విద్యార్థులు రాకపోవడంతో తమకూ ఇబ్బందిగా ఉందని హెచ్‌ఎం రమేశ్ తెలిపారు.


