కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలం ఖాజీపూర్ శివారులోని మానేరు వాగులో పూడికతీత పేరుతో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని, ఖాజీపూర్ క్వారీని రద్దు చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గ్రామస్తులతో కలిసి గురువారం ఖాజీపూర్ చౌరస్తాలో కరీంనగర్– వేములవాడ ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. రహదారిపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి ఆర్డీవో షర్మిల అక్కడికి చేరుకుని, క్వారీ అంశాన్ని కలెక్టర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కమలాకర్ మాట్లాడుతూ ఖాజీపూర్ మానేరు వాగులో ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని అన్నారు. ఇసుక లారీలు రోడ్డెక్కితే అడ్డుకుంటామని హెచ్చరించారు. సర్పంచ్‌లు కోమటిరెడ్డి అంజనీకుమార్, పెంచాల అంజనేయులు, తాండ్ర శ్రీనివాస్, రెడ్డవేణి మధు, రాజశేఖర్, పిల్లి మహేశ్ పాల్గొన్నారు.


