● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్ కార్పొరేషన్: తన ధ్యాస అంతా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యమని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గురువారం నగరపాలకసంస్థ 36వ డివిజన్ మారుతినగర్‌లో రూ.60 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలకు, 27వ డివిజన్ శివాజీనగర్‌లో రూ.49 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి కరీంనగర్‌తో పాటు, పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. యూసీఎఫ్, యూఐడీఎఫ్, స్మార్ట్ సిటీ,అమృత్ తదితర పథకాల్లో భాగంగా వేల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి నగరరూపురేఖలు మారుస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో విద్యార్థులకు 20 వేల సైకిళ్లు అందించామని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా పదోతరగతి విద్యార్థులకు మరో 20 వేల సైకిళ్లను ఉచితంగా అందిసామన్నారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్‌లు తోట అనిల్ పాల్గొన్నారు.


