విదేశీ చదువులకు ‘అంబేద్కర్‌ విద్యానిధి’ | - | Sakshi
Sakshi News home page

విదేశీ చదువులకు ‘అంబేద్కర్‌ విద్యానిధి’

Jul 17 2026 3:16 AM | Updated on Jul 17 2026 3:16 AM

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కరీంనగర్‌టౌన్‌: విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే దళిత విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం గొప్ప అవకాశంగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతోంది. ఇటీవల ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను పెంచడంతో మరింత మందికి ప్రయోజనం చేకూరనుంది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఏటా 210 మందికి సాయం అందించగా, ప్రస్తుతం దాన్ని 500 మందికి విస్తరించారు. అభ్యర్థి చేరే కోర్సు ఫీజు ఆధారంగా ఆర్థిక సహాయం మంజూరు చేస్తారు. అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌, సింగపూర్‌, జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి ప్రపంచ ప్రఖ్యాత దేశాల్లో పీజీ, పీహెచ్‌డీ ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ పథకం తోడ్పడుతోంది.

ప్రతిభే ఎంపికకు ప్రామాణికం

తెలంగాణ ఈ– పాస్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన ధ్రువపత్రాలను జతచేసిన అనంతరం రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలిస్తుంది. జీఆర్‌ఈ, జీమ్యాట్‌, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ పరీక్షల్లో సాధించిన ప్రతిభతో పాటు ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. విదేశీ విశ్వవిద్యాలయం నుంచి ప్రవేశ లేఖ పొందిన వారికి ఆర్థిక సాయం విడుదల చేస్తారు. కోర్సులో విద్యా పురోగతి సంతప్తికరంగా ఉంటేనే తదుపరి విడతల నిధులు మంజూరు అవుతాయి.

అర్హతలు

కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. జీఆర్‌ఈ/జీమ్యాట్‌ లేదా సంబంధిత ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించాలి. ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ పరీక్షలో ప్రతిభ చూపాలి. ఒక కుటుంబం నుంచి ఒక్క విద్యార్థికే అవకాశం.

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు

పాస్‌పోర్టు సైజు ఫొటో, ఆధార్‌, రేషన్‌ కార్డు, స్థానికత ధ్రువపత్రం, బోనాఫైడ్‌, పదో తరగతి, డిగ్రీ మార్కుల మెమోలు, టీసీ, జీఆర్‌ఈ/జీమ్యాట్‌ స్కోర్‌కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌పోర్టు కాపీ, విదేశీ విశ్వవిద్యాలయం ప్రవేశ లేఖ తదితర పత్రాలు సమర్పించాలి.

దళిత విద్యార్థులకు రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం

10 దేశాల్లో ఉన్నత విద్యకు అవకాశం

ఆగస్టు 31 వరకు గడువు

అర్హులైన దళిత విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి, ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎంపిక ప్రక్రియ నిర్వహించి అర్హులను తుది జాబితాలో ఎంపిక చేసి ప్రభుత్వ పరంగా అంబేద్కర్‌ విద్యానిధి పథకాన్ని అందజేస్తాం.

– భాగ్యలక్ష్మి, ఎస్సీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement