● పలువురికి అస్వస్థత
● చికిత్స పొందుతున్న బాధితులు
● అందరూ రెస్టారెంట్లో బిర్యానీ తిన్న వారే..
సిరిసిల్లటౌన్: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్లలో మళ్లీ ఫుడ్ పాయిజన్ కేసులు కలకలం రేపాయి. మొన్న కేసీఆర్‌నగర్‌లో పానీపూరి, నిన్న బాలాజీ స్వీట్‌హౌస్‌లో బల్లి పడిన సంఘటనలు మరువకముందే ఓ రెస్టారెంట్లో బిర్యాని తిన్న కస్టమర్లు సుమారు 20 మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల–కరీంనగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న ఓ రెస్టారెంట్లో ఈనెల 14వ తేదీ రాత్రి పలువురు కస్టమర్లు బిర్యాని తిన్నారు. వారంతా బుధవారం మధ్యాహ్నం నుంచి వాంతులు, కడుపునొప్పి, జ్వరం బారినపడ్డారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఫుడ్ పాయిజన్‌గా వైద్యులు గుర్తించారు. అయితే గురువారం వరకు ఒక్కొక్కరుగా మొత్తంగా పది మంది పట్టణంలోని పలు ఆస్పత్రుల్లో చేరారు. మిగతా వారి వివరాల కోసం అధికారులు విచారణ చేపట్టారు.
ఆస్పత్రుల్లో చేరిన బాధితులు
జిల్లా ఆస్పత్రిలో బుధవారం మధ్యాహ్నం ఇల్లంతకుంట మండలానికి చెందిన చొప్పరి వంశీ(22), శ్రీకాంత్, శ్రావణ్, రవి అనే యువకులు చేరగా గురువారం రాత్రి సిరిసిల్లకు చెందిన మల్లికార్జున్, శ్రీనాథ్, శ్రీనిధి అడ్మిట్ అయ్యారు. స్థానికంగా ఉండే రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో చిన్నబోనాలకు చెందిన రోషన్, రాహుల్, ప్రదీప్, అక్షిత, వేదశ్రీ చికిత్స పొందుతున్నారు. వీరంతా కడుపునొప్పి, తీవ్ర జ్వరం, వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. పలువురికి ఇన్‌ఫెక్షన్ అధికంగా ఉండటంతో ఆస్పత్రిలోనే అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నట్లు ఆయా ఆస్పత్రుల వైద్యులు పేర్కొన్నారు.
ఫుడ్‌సేఫ్టీ అధికారుల విచారణ
సంఘటనపై డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనూష ఆధ్వర్యంలో అధికారులు విచారణ చేపట్టారు. ఆస్పత్రుల్లోని బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. హోటల్‌లో బిర్యాని తిన్నందుకే అస్వస్థతకు గురైనట్లు బాధితులు తెలపడంతో విచారణ చేపడుతున్నట్లు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష వివరించారు.


