● 36 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు ● వేసవిని తలపిస్తున్న వాతావరణం
కరీంనగర్: వానాకాలంలో వాతావరణం మండు వేసవిని తలపిస్తోంది. ఆకాశం నుంచి అమృతం కురవాల్సిన సమయంలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరిత ఉష్ణోగ్రతలు సాధారణంగా కన్నా అధికంగా మారడంతో ఏర్పడిన ఎల్‌నినో పంజా విసురుతోంది. దీని ప్రభావంతో వాతావరణం వేడెక్కుతోంది. జిల్లావ్యాప్తంగా ఉదయం 9గంటల నుంచే భానుడు భగభగమంటూ నిప్పులు కురిపిస్తున్నాడు. సాయంత్రం 6 గంటల వరకు ఇదే పరిస్థితి ఉంటోంది. మండే ఎండలతో పాటు అధిక ఉక్కపోత బెంబేలెత్తిస్తోంది. సగటు ఉష్ణోగ్రతలు 36డిగ్రీలు దాటిపోవడంతో పాటు ఊపిరాడకుండా చేస్తున్న ఉక్కపోత ప్రజలను అవస్థలకు గురిచేస్తోంది. పొద్దంతా, రాత్రి సమయాల్లో ఏసీలు, కూలర్లు లేనిదే క్షణం గడవడం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి కొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత భయానకంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
కరీంనగర్‌క్రైం: రాష్ట్ర 5వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కరీంనగర్ కమిషనరేట్ క్రీడాకారులు సత్తా చాటారు. వివిధ క్రీడాంశాల్లో 11 పతకాలు సాధించి జోన్–3లో అగ్రస్థానంలో నిలిచారు. 90కిలోల బాడీ బిల్డింగ్ విభాగంలో పీసీ పి.రాజు, యోగాలో ఏఆర్‌పీసీ ఎ.శంకర్ స్వర్ణం సాధించారు. 85 కిలోల బాడీ బిల్డింగ్‌లో ఏఆర్‌పీసీ ఎస్.నరేందర్, 80 కిలోల బాడీ బిల్డింగ్‌లో పీసీ ఎండీ.వహాజుద్దీన్, ఆర్మ్ రెజ్లింగ్‌లో ఏఆర్‌పీసీ వి.సాయి మాధవ్, 65 కిలోల ఆర్మ్ రెజ్లింగ్‌లో డబ్ల్యూపీసీ ఎ.స్వప్న రజత పతకాలు గెలు చుకున్నారు. సాయి మాధవ్ 55 కిలోల బాక్సింగ్‌లో, పీసీ జె.శ్రీనివాస్ 81 కిలోల జూడోలో కాంస్య పతకాలు సాధించారు. డబ్ల్యూపీసీ ఎం.అరుణ బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ విభాగాల్లో మూడు కాంస్య పతకాలు సాధించి విశేష ప్రతిభ కనబరిచారు. విజేతలను సీపీ గౌస్ ఆలం అభినందించారు.
తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వద్దు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించొద్దని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆదేశించారు. బుధవారం రిజర్వాయర్‌ను, ఏఈ కార్యాలయంపై నూతనంగా నిర్మిస్తున్న రెండో అంతస్తు భవన పనులను పరిశీలించారు. చివరి దశ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తాగునీటి సంపు, మోటారు పంపుల పనితీరును పరిశీలించారు. నగరవ్యాప్తంగా ప్రజల తాగునీటికి ఇబ్బందులు రాకుండా సమయం ప్రకారం నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. తాగునీటి సంపు, మోటార్ పంపుల షెడ్డు చుట్టూ సిమెంట్ ఫ్లోరింగ్ పనులు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ నీటి ట్యాంకర్లు, ఇతర వాహనాల కోసం ప్రత్యేక షెడ్డు నిర్మించాలన్నారు. ఏఈ సతీశ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ పర్షరాములు పాల్గొన్నారు.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల నేపథ్యంలో గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కె.వీ.కమాన్ ఫీడర్ పరిధిలోని షాషామహల్, లక్ష్మీనగర్ చౌరస్తా, గాయత్రీనగర్ ప్రాంతాలు, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రేకుర్తి సబ్‌స్టేషన్ పరిధిలోని రేకుర్తి, శాతవాహన కాలనీ, విపార్క్ వెనక భాగం, పాతవాడ, కొత్తవాడ, రేకుర్తి కంటి ఆసుపత్రి, ఇందిరమ్మకాలనీ, స్వామికాలనీ, షేకాబ్ కాలనీ, సమ్మక్క గద్దెలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1, రూరల్ ఏడీఈలు పి.శ్రీనివాస్‌గౌడ్, జి.రఘు తెలిపారు.


