చేపలవేటకు వెళ్లి జలసమాధి | - | Sakshi
Sakshi News home page

చేపలవేటకు వెళ్లి జలసమాధి

Jul 10 2026 7:22 AM | Updated on Jul 10 2026 7:22 AM

హుజూరాబాద్‌ రూరల్‌: చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారుడు చెరువులో మునిగి జలసమాధి అయ్యాడు. ఈ ఘటన హుజూరాబాద్‌ మండలంలోని చెల్పూర్‌ గ్రామంలోని పెద్ద చెరువులో గురువారం చోటు చేసుకుంది. మండలంలోని రాజపల్లి గ్రామానికి చెందిన ఈర్ల రవీందర్‌ తోకలపల్లి, రాజపల్లి, చెల్పూర్‌ గ్రామాలకు చెందిన సుమారు యాభై మంది మత్స్యకారులతో కలిసి చెల్పూరు చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పడుతున్న సమయంలో రవీందర్‌ కాలికి ఉన్న కడెం వలలో చిక్కుకోవడంతో మునిగిపోయాడు. గమనించిన తోటి మత్స్యకారులు కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే నీటిని మింగడంతో ప్రాణాలు విడిచాడు. రవీందర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉ న్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

దివ్యాంగురాలిపై లైంగికదాడి చేసిన వ్యక్తిపై పదేళ్ల జైలు

జగిత్యాలజోన్‌: దివ్యాంగురాలిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి పదేళ్ల జైలుతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ జగిత్యాల మొదటి అదనపు జడ్జి సునీత గురువారం తీర్పు చెప్పారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.1.50లక్షల ఆర్థిక సహాయం అందించాలని తీర్పు ఇచ్చారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బిట్ల నర్సయ్య కథనం ప్రకారం.. గొల్లపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఉన్నాడు. అందరూ కూలీ చేసుకుని జీవిస్తారు. చిన్న కూతురు మూగ, చెవిటి, మానసిక వైకల్యంతో బాధపడుతోంది. 2024 జూన్‌ 13న కుటుంబసభ్యులు కూలీ పనులకు వెళ్లారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటికి రాగా.. చిన్న కూతురు ఇంట్లో కనిపించలేదు. కూతురు కోసం చుట్టపక్కల వెదుకుతుండగా.. అదే గ్రామానికి చెందిన ఓరుగంటి శ్రీనివాస్‌ ఆ యువతిని బైక్‌పై ఎక్కించుకుని వెళ్లినట్లు చుట్టు పక్కలవారు చెప్పారు. కుటుంబసభ్యులు సమీపంలోని మామిడితోట వద్దకు వెళ్లగా.. బైక్‌ పార్క్‌ చేసి ఉంది. యువతిపై శ్రీనివాస్‌ లైంగికదాడికి పాల్పడుతూ కనిపించాడు. వారిని గమనించిన శ్రీనివాస్‌ అక్కడినుంచి పారిపోయాడు. బాధితులు గొల్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అప్పటి ఎస్సై సతీష్‌ కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ రాంనర్సింహారెడ్డి దర్యాప్తు చేసి.. నిందితుడిని అరెస్ట్‌ చేసి.. కోర్టులో చార్జీషీట్‌ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్‌ అధికారులు ఎం.కిరణ్‌కుమార్‌, బి.రాజు, వి.శ్రీధర్‌ సాక్ష్యాలు ప్రవేశపెట్టడంతో శ్రీనివాస్‌కు జైలుశిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ.. రూ.1.50 లక్షల పరిహారం అందించాలని సూచించారు.

ఏసీబీ వలలో పీఆర్‌ ఏఈ

రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టివేత

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ జిల్లాలో పంచాయతీరాజ్‌శాఖ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పైడి సతీశ్‌ గురువారం రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కా డు. కరీంనగర్‌ రేంజ్‌ ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. సతీశ్‌ ప్రస్తుతం చొప్పదండి మండలంలో ఉద్యోగం చేస్తున్నాడు. గంగాధర మండలానికి ఇన్‌చార్జిగా ఉన్న సమయంలో నాగిరెడ్డిపూర్‌లో ఉపాధిహామీ కింద చేపట్టిన సీసీ రోడ్ల పనుల ఎం–బుక్‌లో కొలతలు నమోదు చేసి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌కు పంపించేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.10 వేలు డిమాండ్‌ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. గురువారం సాయంత్రం కరీంనగర్‌లో లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సతీశ్‌ను అరెస్ట్‌ చేసి కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement