అసెస్మెంట్‌ కాపీ ఎలా వచ్చింది..? | - | Sakshi
Sakshi News home page

అసెస్మెంట్‌ కాపీ ఎలా వచ్చింది..?

Jul 9 2026 6:59 AM | Updated on Jul 9 2026 6:59 AM

జగిత్యాల: జగిత్యాల బల్దియా నుంచి అసెస్మెంట్‌ కాపీ బయటకు రావడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసెస్మెంట్‌ (మున్సిపల్‌ పరిధిలో ఇళ్లు లేదా ఆస్తి వివరాలు నమోదు చేసి, పన్ను చెల్లించడానికి జారీ చేసే పత్రం) కాపీలు ఇవ్వడం 2019లోనే నిషేధించారు. ఇంటి నంబరు ద్వారానే ఎవరైనా స్థిరాస్థుల క్రయవిక్రయాలు చేసుకుంటారు. తాజాగా జగిత్యాలలో అసెస్మెంట్‌ కాపీ బయటకు రావడం.. అందులో మున్సిపల్‌ కమిషనర్‌ సత్యప్రణవ్‌ సంతకం ఫోర్జరీ చేసినట్లు ఉండడం జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. జగిత్యాల బల్దియాలో ఇప్పటికే ఏడాదిలోనే దాదాపు పదిమందికి పైగా కమిషనర్లు మారారు. ఇటీవల గ్రూప్‌–1 అధికారి అయిన సత్యప్రణవ్‌ ఇక్కడకు వచ్చారు. తాజాగా ఆయన సంతకం ఫోర్జరీ కావడం గమనార్హం. బల్దియాలో అధికారుల సంతకాలే ఫోర్జరీ చేస్తున్నారంటే ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవడం పెద్ద కష్టంకాదు.

అక్రమాల వెల్లువ..

మున్సిపాలిటిలో గతంలో ఇదే రెవెన్యూ విభాగంలో ఓ భూకుంభకోణానికి సంబంధించి కమిషనర్‌, ఆర్వో సస్పెండ్‌ అయ్యారు. మరో కమిషనర్‌ సంతకాన్ని బల్దియాలోనే పనిచేస్తున్న ఓ వ్యక్తి ఫోర్జరీ చేసిన ఘటన వెలుగుచూసింది. అయినప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోకుండా వదిలేయడం గమనార్హం. అధికారులు, సిబ్బంది అక్రమాలు, అవినీతిపై అటు ఏసీబీ, ఇటు విజిలెన్స్‌ అధికారులు ఏకకాలంలో 17 గంటల పాటు సోదా చేశారు. ప్రతి రికార్డును పట్టుకెళ్లారు. కొన్ని శాఖల అధికారులను కరీంనగర్‌కు పిలిపించారు. తాజాగా ఘటన జరగడంతో అధికారులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కమిషనర్‌ సంతకం ఫోర్జరీపై అదనపు కలెక్టర్‌ సీరియస్‌ అయినట్లు తెలిసింది. వాస్తవంగా అసెస్మెంట్‌ కాపీ ఇవ్వకుండానే ఇంటి నంబరు ద్వారానే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. మున్సిపాలిటీకి ఆస్తిపన్ను కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఇలా రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం సిబ్బంది తమకేం తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు.

ఫోర్జరీ చేసిన వ్యక్తిపై కేసు నమోదు

జగిత్యాలక్రైం: మున్సిపల్‌ కమిషనర్‌ సత్యప్రణవ్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆస్తి రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించిన సమిండ్ల రాజేశ్‌ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్‌ తెలిపారు. పట్టణంలోని ఇంటి నంబరు 3–5–128కు సంబంధించిన అసెస్మెంట్‌ సర్టిఫికెట్‌ను నకిలీ (ఫోర్జరీ)గా తయారుచేసి దానిపై మున్సిపల్‌ కమిషనర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఉపయోగించినట్లు గుర్తించారు.

కమిషనర్‌ సంతకం ఫోర్జరీ ద్వారా రిజిస్ట్రేషన్‌

స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కమిషనర్‌

ఫోర్జరీ చేసిన వ్యక్తిపై కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement