భూ తగాదాలే ఆదాయ మార్గాలు
రెవెన్యూ, పోలీస్‌శాఖల్లో ‘ఆమ్యామ్యాల’ దందా
పట్టా చేయాలన్నా.. సర్వేకు రావాలన్నా ‘ఇచ్చుకో’వాల్సిందే
తమ పరిధిలో లేకున్నా భూతగాదాల్లో దూరుతున్న పోలీసులు
సాక్షి, పెద్దపల్లి: ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత కీలకమైన రెవెన్యూ, పోలీస్‌శాఖలు ప్రజలకు రక్షణ, సేవలు అందించడం పక్కన పెట్టి.. భూ తగాదాలనే ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కలెక్టరేట్‌లో కలెక్టర్ రెవెన్యూ, పోలీస్ అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. సివిల్ పంచాయితీల్లో పోలీసుల జోక్యంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల అండతో కొందరు అవినీతికి పాల్పడుతున్నారని హెచ్చరించడంతో రెవెన్యూ, పోలీస్ శాఖల మధ్య సమన్వయం లోపించి ‘కోల్డ్‌వార్’ మొదలైందనే ప్రచారం సాగుతోంది. ఫలితంగా ఈ రెండు శాఖల పనితీరు చర్చనీయాంశంగా మారింది. సామాన్యులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయాల మెట్లు ఎక్కినా.. పోలీస్‌స్టేషన్ గడప తొక్కినా.. ‘ఆమ్యామ్యాలు’ చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని, అవినీతిలో రెండు శాఖలూ ఒకటేననే చర్చ నడుస్తోంది.
రెవెన్యూలో ‘రేట్’ దందా
రెవెన్యూ రికార్డుల సవరణ నుంచి భూముల రిజిస్ట్రేషన్ వరకు ప్రతీ పనికి రేటు నిర్ణయించడం గమనార్హం. అధికారులు నేరుగా డబ్బులు తీసుకోకుండా.. కిందిస్థాయి సిబ్బంది లేదా ప్రైవేట్ ఆన్‌లైన్ కేంద్రాల ఆపరేటర్ల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారసత్వ పట్టాలు చేసేందుకు కుటుంబసభ్యులందరు హాజరైనా రకరకాల కొర్రీలు పెడుతూ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు లంచం డిమాండ్ చేస్తున్నారనే విమర్శలున్నాయి. తమకు చెప్పకుండా స్లాట్ బుక్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం చేయడం, ఇబ్బందులకు గురిచేయడం పరిపాటిగా మారింది. సత్వరమే జారీ చేసే పహణీ, కుల, ఆదాయం తదితర ఽధ్రువపత్రాల జారీకి ఆన్‌లైన్ కేంద్రాల ఆపరేటర్ల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారని అంటున్నారు.
పోలీస్‌స్టేషన్లలో ‘పెద్దరాయుడి’ తీర్పులు
చట్టప్రకారం సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదు. ఆక్రమణలు, దాడులు, బెదిరింపులను క్రిమినల్ కేసుగా పరిగణించి చర్యలు తీసుకోవాలి. కానీ, అనేక పోలీస్‌స్టేషన్లలో దీనికి భిన్నంగా జరుగుతోంది. ‘ఇక్కడ సివిల్ కేసులు పరిష్కరించబడవు‘ అని బోర్డులు ఉన్నా.. తెరవెనుక ప్రతీ వివాదాన్ని ‘సెటిల్’ చేస్తున్నారని అంటున్నారు. బాధితుల ఫిర్యాదులను ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేయడానికి బదులు, స్టేషన్లలోనే రాజీ చర్చలు జరుపుతూ, అంగ, అర్ధబలం ఉన్నవారికి అనుకూలంగా తీర్పులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భూవివాదాలపైనే ఎక్కువ దృష్టి
రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోవడంతో వ్యవసాయ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో భూ వివాదాలు గతంకన్నా రెట్టింపయ్యాయి. పోస్టింగ్‌ల కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్న కొందరు అధికారులు.. ఆ పెట్టుబడిని రాబట్టుకునేందుకే శాంతిభద్రతల కన్నా సివిల్ సెటిల్‌మెంట్లపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2010లో అప్పటి ప్రభుత్వం జారీచేసిన నిబంధనల ప్రకారం.. సివిల్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేసి 15 రోజుల్లోగా విచారణ పూర్తిచేయాలి. ఆ ఉత్తర్వులు అటకెక్కడంతో స్టేషన్లకే పరిమితమైన ‘సెటిల్‌మెంట్’ సంస్కృతి సామాన్యుడిని మరింత సంక్షోభంలోకి నెడుతోంది. ఉన్నతాధికారులు స్పందించి, వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.


