స్పోర్ట్స్ క్యాపిటల్‌గా కరీంనగర్ ఎదగాలి
● రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు ● అట్టహాసంగా సీనియర్స్ కబడ్డీ పోటీలు ప్రారంభం
కరీంనగర్‌స్పోర్ట్స్: క్రీడల్లో కరీంనగర్ జిల్లా తెలంగాణలో స్పోర్ట్స్ కాపిటల్‌గా ఎదగాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన 72వ రాష్ట్రస్థాయి సీనీయర్స్ పురుషులు, మహిళల కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీ ల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన మానకొండూర్ శాసన సభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఒలింపిక్, రాష్ట్ర, జిల్లా కబడ్డీ క్రీడా పతాకాలను ఆవిష్కరించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్‌ఫాస్ట్ చేయగా.. వారు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసిందన్నారు. 2036లో జరగనున్న ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించే దిశగా క్రీడాపాలసీని తీసుకొచ్చిందని అన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ.. నిఖత్ జరీన్ లాంటి ఎందరో క్రీడాకారులకు ప్రోత్సాహాన్నిచ్చి క్రీడల్లో ఆసక్తిని మరింత పెంచేలా ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కాసాని వీరేశం, మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు సీహెచ్ సంపత్‌రావు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అమిత్‌కుమార్ మాట్లాడుతూ.. 33 జిల్లాల నుంచి 952 మంది క్రీడాకారులు, 200 మంది రెఫరీలు, కోచ్‌లు, మేనేజర్లు, సంఘం బాధ్యులు హాజరైనట్లు చెప్పారు. 28 మంది పురుషులు, మహిళా క్రీడాకారులను జాతీయ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ శాసన సభ్యుడు ఆరెపల్లి మోహన్, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, అంతర్జాతీయ క్రీడాకారులు శ్రీనివాస్‌రెడ్డి, గంగాధరి మల్లేశ్, కబడ్డీ సంఘం చీఫ్ ప్యాట్రన్ ఇ.ప్రసాద్‌రావు, జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి మల్లేశ్‌గౌడ్, డీవైఎస్‌వోలు శ్రీనివాస్‌గౌడ్, సురేశ్, రాష్ట్ర, జిల్లాల కబడ్డీ సంఘం బాధ్యులు, కోచ్‌లు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
పోటీలను ప్రారంభించిన మంత్రి
సీనియర్స్ పోటీల్లో భాగంగా పురుషుల విభాగంలో కరీంనగర్, ఖమ్మం జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ క్రీడాకారులను మంత్రి పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. మహిళల పోటీలను సైతం ప్రారంభించారు. పారమిత విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ పోటీల సందర్భంగా రూపకల్పన చేసిన అల్బమ్‌లు ఆకట్టుకున్నాయి.


