252 జీవోను సవరించాలి
కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబరు 252ను వెంటనే సవరించాలని లేదా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు శనివారం కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. ఈ ఆందోళనలో ఫీల్డ్ రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మీడియా అక్రిడిటేషన్ రూల్స్–2025 జర్నలిస్టుల మధ్య విభజన సృష్టిస్తున్నాయన్నారు. డెస్క్ జర్నలిస్టులకు పూర్తి అక్రిడిటేషన్ కార్డు ఇవ్వకుండా ‘మీడియా కార్డు’ పేరిట వేరుచేయడం అసంతృప్తికి కారణమవుతోందన్నారు. కొత్త జీవోలోని నిబంధనలు అస్పష్టంగా ఉండటం, చిన్న పత్రికలు, కేబుల్ చానళ్లు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులపై కఠిన నియమాలు విధించడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10వేల మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీల్డ్, డెస్క్ జర్నలిస్టుల మధ్య తేడా లేకుండా ఒకే విధంగా అక్రిడిటెడ్ జర్నలిస్టులుగా గుర్తించేలా జీవోను సవరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ ఆందోళనలో టీయూడబ్ల్యూజే హెచ్–143 జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాలకృష్ణ, నాయకులు ప్రకాశ్‌రావు, వేణుగోపాలరావు, జెర్రిపోతుల సంపత్, రామకృష్ణ, హృషికేష్, కొండల్‌రెడ్డి, యాదగిరి, డెస్క్ జర్నలిస్ట్‌లు సంపత్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.


