హత్యనా.. ఆత్మహత్యనా..?
● గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ● మల్లాపూర్ మండలం వాల్గొండకు చెందిన కుర్ర మల్లేశ్‌గా నిర్ధారణ
రాయికల్: రాయికల్ పట్టణంలోని చెరువులో రెండు రోజుల క్రితం కనిపించిన మృతదేహం మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామానికి చెందిన కుర్ర మల్లేశ్ (22)గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు శవాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వాల్గొండకు చెందిన కుర్ర మల్లేశం చిన్నతనంలోనే తల్లి నర్సు, తండ్రి పోచయ్య చనిపోయారు. మల్లేశ్ తన అక్క నవ్యతో కలిసి పనులు చేసుకుంటున్నాడు. నవ్యకు రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన వ్యక్తితో వివాహమైంది. అప్పటినుంచి మల్లేశ్ రాయికల్‌లో ఓ కాంట్రాక్టర్ వద్ద రోడ్డు పనులు చూసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. ఈనెల 11న పంచాయతీ ఎన్నికల్లో వాల్గొండలో ఓటు హక్కు వినియోగించుకుని అక్క వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో నవ్య రాయికల్ వచ్చింది. దీంతో మల్లేశ్ తిరిగి కాంట్రాక్టర్ వద్దకు వెళ్లినట్లు నవ్య భావించింది. మల్లేశ్ చెరువులో శవమై కనిపించడంతో బోరున విలపించింది. తన తమ్ముడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఎవరో హత్య చేసి ఉంటారని నవ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు మల్లేశ్ ఆత్మహత్య చేసుకున్నాడా..? హత్యకు గురయ్యాడా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


