రైళ్ల వేగం మరింత పెంపు
● రైలుపట్టాల కింద సిమెంట్ స్లీపర్లు
● పాత సిమెంట్ స్లీపర్ల తొలగింపు
● కాజీపేట – బల్హార్షా సెక్షన్ల మధ్య పనులు
ఓదెల(పెద్దపల్లి): కాజీపేట బల్హార్షా సెక్షన్ల మధ్య రైళ్లవేగం మరింత పెంచేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా జమ్మికుంట, బిజిగిరిషరీఫ్, పొత్కపల్లి, ఓదెల, కొలనూర్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి వరకు రైలుపట్టాల కింద కొత్త సిమెంట్ స్లీపర్లు అమర్చుతున్నారు. ప్రస్తుతం మూడోలైన్ అందుబాటులోకి రావడంతో ఒకేమార్గంలో రెండు రైళ్లు అప్ అండ్ డౌన్ చేస్తున్నాయి. కాలం చెల్లిన సిమెంట్ స్లీపర్లను తొలగించి రైలు వేగాన్ని తట్టుకునేలా గేజ్‌పెంచిన ఆధునిక సిమెంట్ స్లీపర్లు వేస్తున్నారు. ఒక్కో రైలు వేగం గంటకు 110 కి.మీ. ఉందని, దానిని గంటకు 130 కి.మీ. వరకు పెంచేందుకు రైల్వేశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. మూడోలైన్‌తో గూడ్సురైళ్ల వేగం కూడా పెంచనున్నారు. ఒక రైలు వెనకాల మరోరైలు వెళ్లేందుకు వీలుగా ఆటోమెటిక్ సిగ్నల్స్ సిస్టం ప్రారంభించారు.


