డబ్బులు ఇప్పించాలని సెల్ టవర్ ఎక్కిన రైతు
● ఎస్‌ఐ సూచనతో దిగివచ్చిన బాధితుడు
ఇల్లంతకుంట(వేములవాడ): అమ్మిన భూమి పైసలు ఇవ్వడం లేదని సెల్ టవర్ ఎక్కగా.. పోలీసులు కల్పించుకోవడంతో దిగారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లకు చెందిన రైతు, మాజీ ఉపసర్పంచ్ కర్ల రవి బుధవారం వల్లంపట్ల పొలిమేరలోని సెల్‌టవర్ ఎక్కాడు. అది చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సెల్‌టవర్ పై నుంచే తన బాధను ఫోన్‌లో ఎస్సైకి వివరించగా.. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో దిగి వచ్చాడు. తన 3.13 ఎకరాల వ్యవసాయ భూమిని రూ.75.47లక్షలకు గ్రామానికి చెందిన మాందాటి కరుణాకర్‌రెడ్డికి మూడేళ్ల క్రితం అమ్మి రిజిస్ట్రేషన్ చేశానని తెలిపారు. అయితే ఇంకా తనకు వడ్డీతో సహా రూ.43లక్షలు రావాల్సి ఉందని, ఇవ్వడం లేదని తెలిపారు. రెవెన్యూ అధికారి శశికుమార్ రిపోర్ట్ నమోదు చేసి తహసీల్దార్ ఫరూక్‌కు అందజేశారు. తనకు న్యాయం చేయాల్సిందిగా కర్ల రవి అధికారులను వేడుకున్నాడు.


