ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య..?
● హత్య చేశారంటూ కుటుంబ సభ్యుల ఆందోళన
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని అన్నపూర్ణ చౌరస్తా వద్ద శక్తి మిల్క్ డెయిరీలో కలవేని కిరణ్ (29) ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన కిరణ్ మిత్రుడు రాజేశ్‌తో కలిసి అన్నపూర్ణ థియేటర్ వద్ద శక్తి మిల్క్ డెయిరీ ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి ఇద్దరు కలిసి దుకాణం మూసి వేర్వేరు గదుల్లో పడుకున్నారు. మంగళవారం ఉదయం లేచేసరికి కిరణ్ దుకాణంలో ఉరేసుకుని కనిపించాడు. దీంతో రాజేశ్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కిరణ్‌కు ఎలాంటి ఇబ్బందులూ లేవని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు విచారణ చేపడతామని హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతుడి భార్య వీణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై రవికిరణ్ తెలిపారు.
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య..?


